- అక్షయ తృతీయ వచ్చేసింది..
- లాక్ డౌన్ నేపథ్యంలో కొనుగోళ్లకు బ్రేక్
ఇప్పటికే ఆరోగ్య, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా తాజాగా భారతీయుల సెంటిమెంటుపైనా ఎఫెక్ట్ చూపిస్తోంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సెంటిమెంట్‌ను భారతీయులు పెద్ద ఎత్తున పాటిస్తారు. తాజా లాక్ డౌన్, ఫిజికల్ డిస్టెన్స్ వంటి నిబంధనలు, పరిమితుల నేపథ్యంలో అక్షయ తృతీయ సెంటిమెంట్ కొనసాగించడం కష్టంగా మారింది.
లాక్ డౌన్ ఎఫెక్ట్
కరోనా వ్యాప్తితో మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ తొలి దశను విధించారు. అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 26న ఉండడంతో అక్షయ తృతీయ పండగను పురస్కరించుకుని బంగారం కొనుగోలు చేయాలని చాలా మంది అనుకున్నారు. అయితే లాక్ డౌన్ ను ఏప్రిల్ 14 నుంచి మే 3 వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించగా తెలంగాణ ప్రభుత్వం దీన్ని మరికొంత సవరించి మే 7 వరకు పొడిగించింది. ప్రభుత్వం ఆంక్షలను కొనసాగించే విషయంలో దృఢంగా ఉంది. దీంతో అక్షయ తృతీయకు బంగారం దుకాణాలు తెరుచుకునే అవకాశం దాదాపుగా లేదు. సాధారణంగా అక్షయ తృతీయ వస్తే చాలు బంగారం దుకాణాలన్నీ కిటకిటలాడుతుంటాయి. ఉన్నవారైనా.. లేనివారైనా సరే ఎంతో కొంత పసిడిని కొని సంతోషపడతారు. ఇలా చేస్తే సిరిసంపదలు కలిసి వస్తాయని నమ్ముతుంటారు. ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితుల్లో పండితులు అక్షయ తృతీయ రోజు ఏం చేయాలో సలహలు సూచనలు ఇస్తున్నారు. లాక్ డౌన్ ఉంది కాబట్టి అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు. అక్షయ తృతీయ రోజు ఏం చేస్తే మంచిదో చెబుతున్నారు .
ప్రత్యామ్నాయం ఉందా?
లాక్ డౌన్ ఉండడంతో అక్షయ తృతీయ రోజు ఎంతో కొంత బంగారం కొంటున్నవారు.. ఈ సారి తమ సెంటిమెంట్‌ను ఎలాగైనా కంటిన్యూ చేయాలనే భావిస్తున్నారు. కష్టమర్ల మనోగతం తెలిసిన బంగారం షాపులు సరికొత్త పద్దతుల్లో వారిని సంతృప్తి పరిచేందుకు ముందుకు వస్తున్నాయి. ఆన్లైన్ స్టోర్లను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నాయి. అక్షయ తృతీయ సెంటిమెంట్ ఉన్న వారు ఆన్లైన్ స్టోర్‌కి వెళ్లి అక్కడ అందుబాటులో ఉన్న డిజైన్లు, వాటి ధరలను పరిశీలించిన ఆర్డన్ను బుక్ చేసుకుని నగదు చెల్లించాల్సి ఉంటుంది. బంగారం కొన్న కస్టమర్లకు గోల్డ్ ఓనర్ షిప్ సర్టిఫికెట్లను పంపేందుకు సిద్ధం అవుతున్నాయి. మరికొన్ని కంపెనీలు అక్షయ తృతీయ రోజే మీరు బంగారం కొనుగోలు చేసినట్లుగా డిజిటర్ రసీదులను, శుభాకాంకక్షలను పంపిస్తారు. ఆ తర్వాత లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత బంగారం ఇంటికి హోమ్ డెలివరీ చేయడం లేదా తమకు సంబంధించిన షాపుల్లో డిజిటల్ రసీదులను చూపించి బంగారం పొందవచ్చని హామీ ఇస్తున్నాయి. మొత్తానికి ఏదో ఓ విధంగా సెంటిమెంట్ ఫాలో అయ్యామన్న సంతృప్తి చెందితే చాలనుకుంటున్నారు పసిడి ప్రేమికులు.
సక్సెస్ అయ్యేనా?
భారతీయులు సాధారణంగా బట్టలు కొనేటప్పుడే వాటిని నాణ్యతను పలుమార్లు పరిశీలించి కొనాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటారు. అలాంటిది బంగారం వంటి విలువైన వస్తువుల విషయంలో ఆన్ లైన్లో ఇమేజ్, వీడియోలు చూసి కొంటారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లాక్డవున్లు విధిస్తున్నారు. దీని వల్ల అన్ని చోట్ల ఆర్థిక రంగం చిక్కల్లో పడింది. దీనికి తోడు ఆర్థిక మాంద్యం ముప్పు ముందు నుంచి పొంచే ఉంది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలనుకు వారికి బంగారం కొనుగోలు ఒక్కటే మెరుగైన ఆప్షన్లా మారింది. పైగా ఆర్థిక రంగం స్థంభించి పోవడంతో రోజురోజుకి బంగారం డిమాండ్ అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతోంది. మరోవైపు ఎన్నడూ లేని విధంగా క్రూడ్ ఆయిల్ ధర పాతాళానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు బంగారం ఒక్కటే మేలైన పరిష్కారంలా ఉంది. సరైన నమ్మకం కలిగించగలితే అక్షయ తృతీయ రోజు ఆన్లైన్లో బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ముందుకు వస్తారని, ఇది సెంటిమెంట్‌ను కొనసాగించడంతో పాటు విపత్తు సమయంలో తమ భవిష్యత్ కు బంగారు బాటలు వేస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉందని అంటున్నారు.
ఆఫ్ లైన్ పరిస్థితి ఇలా..
పెద్ద పెద్ద బంగారు విక్రేతలు ఆన్లైన్ తరహా పద్ధతులు పాటిస్తుంటే గ్రామాలు, మున్సిపాలీటీలలో ఉన్న వారు ప్రభుత్వ నిబంధనల సడలింపు గంపెడాశతో ఉన్నారు. ఏప్రిల్ 20న కొన్ని రంగాలకు లాక్డౌన్ నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 25న మరికొన్ని రంగాలకు మినహాయింపు ఇచ్చింది. మెట్రో, మున్సిపాలిటీలను మినహాయిస్తే మల్టీ బ్రాండ్ షోరూంలు తప్ప సాధారణ క్రయవిక్రయాలను జరుపుకోవచ్చని సూచించింది. ఈ సడలింపుల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. ఈ నిబంధనలు అమలు చేస్తే గ్రామాలు, మున్సిపాలిటీలకు మినహాయించి ఇతర ప్రాంతాల్లో బంగారం లావాదేవీలు జరుపుకునేందుకు ఆస్కారం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గోల్డ్ స్మిత్‌లు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే వీరికి పరిచయస్తులైన కష్టమర్ల నుంచి బంగారం కావాలంటూ ఫోన్లు వస్తున్నాయి. అయితే కరోనా విస్తరిస్తున్న తీరును పరిశీలిస్తున్న వైద్య నిపుణులు బంగారం కొనుగోలు సెంటిమెంట్‌ను ఒక ఏడాది వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ పండుగను ఇంటిలోనే కుటుంబ సభ్యులతో కలిసి చెసుకోవడం బెటర్ అంటున్నారు. కరోనాను కట్టడి చేసే ప్రయత్నాల్లో ఆధికారుల సలహాలను పాటించాలని సలహా ఇస్తున్నారు.
-జీపీ రెడ్డి