- కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు
న్యూఢిల్లీ: దేశంలో ఫుట్ బాల్ ను మరింత మెరుగుపర్చేందుకు టాప్ కార్పొరేట్ కంపెనీలు, స్టేట్, డిస్ర్టిక్ బాడీలు ఇతోధికంగా సాయం చేయాలని కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజిజు కోరారు. గ్రాస్ రూట్ లెవెల్లో ఈ క్రీడను అభివృద్ధి చేయాలని సూచించారు. భారత్ లో ఫుట్ బాల్ కల్చర్ ను ఎలా వృద్ధి చేయాలనే దానిపై మంత్రి తన దృక్పథాన్ని వెల్లడించారు.
‘పాఠశాల స్థాయిలో ఫుట్ బాల్‌ను ప్రవేశపెట్టాలి. స్థానికంగా లీగ్ లు జరిగేలా ప్రోత్సహించాలి. దేశ వ్యాప్తంగా ఉన్న పిల్లలో ఈ క్రీడకు సంబంధించిన మెళకువలు నేర్పించాలి. ఒకసారి మాస్ గా ఈ క్రీడను జనాల్లోకి తీసుకెళ్తే ఆ తర్వాత నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసుకోవచ్చు. వాళ్లు ఎలైట్ ఫుట్ బాల్ గా తీర్చిదిద్దొచ్చు. ప్రభుత్వపరంగా అన్ని వనరులను మేం సమకూరుస్తాం.
ఆర్థికంగా కూడా చేయూత అందిస్తాం. కానీ ఫుట్ బాల్ బాడీస్ రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిరంతరం టోర్నీలను ఏర్పాటుచేసే విధంగా ప్రణాళికలు రచించాలి. తద్వారా ప్రజాదరణ పెరిగి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు అందుబాటులోకి వస్తారు’ అని రిజిజు వ్యాఖ్యానించాడు. అన్ని స్థాయిల్లో లీగ్ ను నిర్వహించేందుకు అవసరమైన స్పాన్సర్ షిప్స్ ఇవ్వాలని కార్పొరేట్ కంపెనీలను కోరారు. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రిజిజు స్పష్టంచేశారు.