ననః పురో జనపదాన గ్రామాన గృహావయమ్
నిత్యం వనౌకసస్తాత వనశైల నివాసినః
తస్మాద్గవాం బ్రాహ్మణానా మద్రేశ్చారభ్యతాం మఖః
శ్రీమద్భాగవత పురాణంలో వేదవ్యాస మహర్షి శ్రీకృష్ణుడి ముఖతఃనందుడితో చెప్పించిన మాటలివి.. నందగోకులంలో యజ్ఞసంరంభాలు ఆరంభమైన సందర్భంలో శ్రీకృష్ణుడు తన తండ్రి నందుడి వద్దకు వెళ్లి ఈ హడావుడి అంతా ఎందుకని అడిగాడట. దానికి ఆయన ఇంద్రుడి తృప్తి కోసం తాము చేయబోయే యాగం గురించి కృష్ణుడికి చెప్పాడట. ‘వర్షాధిపతియైున ఇంద్రుడు సంతసించి వర్షాలు కురిపించిన కారణంగా ప్రకృతి పులకించి పుష్కలంగా గడ్డి పెరిగి మన గోసంపదకు సమృద్ధిగా ఆహారం లభిస్తోంది. మన పెద్దలంతా తరతరాలుగా ఈ ఇంద్రయాగం చేస్తూ వచ్చారు. అందుకే ఈ ఆచారం వదలకుండా మనమూ యాగం చేయబోతున్నాం’ అని వివరించాడట. అప్పుడు కృష్ణుడు.. ‘తండ్రీ! మనకు పురములు లేవు, జనపదములు లేవు, చిన్న చిన్న గ్రామములూ లేవు. మనమంతా ఎల్లప్పుడూ ఈ అరణ్యప్రాంతాల్లో జీవించేవారమే. సర్వదా ఈ అడవులు, కొండ ప్రాంతాల్లో మన గో సంపదను కాపాడుకుంటూ సంచరించేవారమే కదా! అందుకని మనకు అతిముఖ్యమైన ఈ గో సమూహాలు,, మనకు జ్ఞానాన్ని అందించే వేదవిదులైన బ్రాహ్మణులు, మనకు జీవితాధారమైన ఈ కొండను పూజించి యజ్ఞం చేయి’ అని నందుడితో చెప్పిన సందర్భంలోనిదీ పద్యం. ‘ఇంద్రుడు వర్షాధిపతి కనుక సకాలంలో వర్షాలు కురిపించవలసిన బాధ్యత ఆయనదే.. యాగాలు చేసి తృప్తిపరిస్తేనే వానలు కురిపిస్తాననడం తప్పు’ అని కృష్ణుడు వివరించాడు. ‘మనకు జీవితాన్నిచ్చే ఈ ప్రకృతే మనకు దైవం, ఈ గోవులే మనకు దైవాలు’ అని తేల్చిచెప్పాడు.
‘‘యవసంచ గవాందత్వా’’..
‘మన ఆవులకు గడ్డి ఇవ్వండి, అర్హతలను బట్టి పూజించండి. మన బతుకును నడిపించే దేవతను(గోవు) వదిలిపెట్టి వేరొక దేవతను సేవించడం, లేదా పూజించడం మంచిది కాదు’ అన్నాడు. ఇంద్రయాగానికి బదులుగా గోవర్ధనగిరి, గో సంపద, బ్రాహ్మణులను పూజిద్దామని కృష్ణుడు చెప్పడం వెనక.. మన ఎదుగుదలకు కారణమైనవాటిని, వ్యక్తులను మరువరాదన్న సందేశం కూడా ఉంది. పైగా అధిపతులైన వారు మనం పూజిస్తేనే కరుణిస్తారన్నది తప్పు అనే విషయాన్ని కూడా ఈ ఘట్టంలో భాగవతం చెప్పింది. ప్రకృతి పూజ వల్ల సర్వ జీవజాతులు సుఖంగా బతకగలవన్న భాగవత సందేశం శిరోధార్యం.
– దిండిగల్ ఆనంద్ శర్మ,
సీనియర్ జర్నలిస్ట్,
సెల్నం.96660 06418