- రన్నింగ్ ట్రాక్ లో స్వర్ణాల పంట
- అవరోధాలను అవకాశంగా మల్చుకున్న హిమదాస్
అద్భుతాలను ఆశించలేదు.. కానీ అవకాశాలను అందుకుంది. ఉవ్వెత్తు కెరటంలా ఎగిసి పడలేదు.. కానీ నిలకడగా విజయాల సెలయేరును ప్రవహింపచేసింది. అవరోధాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కానీ అలుపెరగని పోరాటంతో అక్కున చేర్చుకుంది. గమ్యం మారే సమయంలో గమనాన్ని నమ్ముకుంది. గోల్ పోస్ట్‌పై పెట్టిన గురిని ట్రాక్ మీదకు తీసుకొచ్చింది. బురదలో పరుగెత్తిన కాళ్లతో పరుగు పందానికి స్వర్ణాల బాట వేసుకుంది. తొలి యవ్వనంలో తొలకరి మేఘంలా రికార్డుల జల్లులు కురిపిస్తూ కష్టాల కడలిని కన్నీళ్ల సుడులను సుదూర తీరాలకు తరుముతూ అస్సాం నుంచి అంతర్జాతీయ స్థాయికి అలుపెరగకుండా పరుగు పెడుతూనే ఉంది. మధ్యలో వచ్చే అవరోధాల మజిలీలకు ఎనలేని ఆత్మవిశ్వాసంతో అడ్డుకట్ట వేసుకుంటూ వెళ్తున్న ‘డింగ్ ఎక్స్ ప్రెస్’ హిమదాస్ ఎందరికో స్ఫూర్తిదాయకం.
2018 జూలై 12.. ఫిన్లాండ్ లోని టాంపేర్ స్టేడియం. ఐఏఏఎఫ్ అండర్–20 ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్ షిప్ జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 156 దేశాలకు చెందిన స్ర్పింటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మహిళల 400 మీటర్ల రేస్ కోసం భారత్ నుంచి ఓ 19 ఏళ్ల అమ్మాయి మెల్లగా గేట్ లో నుంచి లోపలికి వస్తుంది. స్టేడియంలో చప్పట్లు లేవు. పెద్ద హంగామా కూడా లేదు. ఆమె కూడా అమాయకపు చూపులతో లోలోపల భయంతో అడుగులో అడుగు వేసుకుంటూ వస్తోంది. అప్పటికే కొద్దోగొప్పో పేరున్న రేసర్లు అందరూ తమకు కేటాయించిన లైన్లలో నిలబడ్డారు. తమ అభిమానులకు అభివాదాలు చేస్తూ పరుగు కోసం రెడీ అవుతున్నారు. ఎరుపు రంగు ట్రాక్ ను చూడడమే గొప్ప అనుకుంటున్న భారత అమ్మాయి.. దానిపై పరుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. అంచనాలు లేవు.. ఆశలూ లేవు.. అంతర్జాతీయ స్థాయిలో పోటీచేస్తే అనుభవం వస్తుందనే ఒకే ఒక్క ఆలోచన.. కట్ చేస్తే.. రిఫరీ ట్రిగ్గర్ నొక్కాడు.. పరుగు మొదలైంది. తొలి 100మీటర్లు.. కొత్త ఉత్సాహం.. రెండో వంద మీటర్లు.. పోటీ ఇవ్వాలనే ఆలోచన.. మూడో వంద… గెలవాలనే కసి… నాలుగో వంద.. ఎనలేని ఆత్మవిశ్వాసం.. లేడి పిల్లలా కాకుండా చిరుతలా పరుగు పెట్టిన భారత అమ్మాయి స్వర్ణం గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ టోర్నీలో ఇండియా తరఫున పతకం సాధించిన తొలి మహిళా అథ్లెట్ గా రికార్డులకెక్కింది. ఆమెనే హిమదాస్. కేవలం అంతర్జాతీయ స్థాయిలో పరుగు మొదలుపెట్టిన 18 నెలలో ఈ ఘనత సాధించడం అతి పెద్ద విజయం.
ఫుట్ బాల్ వదిలేసి..
అసోంలోని నాగయోన్ జిల్లాలోని డింగ్ గ్రామంలో హిమదాస్ పుట్టింది. దిగువ మధ్య తరగతి వ్యవసాయదారుల కుటుంబం. ప్రతిరోజు పొలం పనులకు వెళ్లడం, తల్లిదండ్రులకు చేదోడుగా నిలవడం. నలుగురు పిల్లల్లో చిన్నమ్మాయి హిమ. డింగ్ స్కూల్లోనే చదువుకున్న హిమకు క్రీడలంటే ఇష్టం. ఫుట్ బాల్ పై ఆసక్తి ఎక్కువ. మగపిల్లలతో కలిసి ఆడేది. మైదానంలో ఆమె స్పీడ్, బంతిని తన్నే సామర్థ్యాన్ని చూసి జవహర్ నవోదయ హై స్కూలుకు చెందిన టీచర్ శంషుల్ షేక్.. స్ర్పింట్ ను ఎంచుకోమ్మని సలహా ఇచ్చాడు. అందులో కొన్ని మెళకువలు కూడా నేర్పాడు. అక్కడ మొదలైన పరుగుల పందెం.. అలా ఒక్కోదశను అధిగమిస్తూ అంతర్జాతీయ స్థాయికి చేరింది.
కెరీర్ ఆరంభంలో రన్నింగ్‌కు కావాల్సిన స్పైక్స్ కూడా కొనుకోలేని పరిస్థితి. లో క్లాస్ షూస్ తోనే ప్రాక్టీస్ చేసే హిమ వాటితోనే డిస్ర్టిక్ట్, స్టేట్ లెవల్ టోర్నీల్లో పాల్గొంది. బూట్లు లేకుండా పొలం గట్ల వెంబడి పరుగెత్తి తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోయింది. 2016లో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో ఫస్ట్ టైమ్ హిమ టాలెంట్ బయటపడింది. అయితే ప్రొఫెషనల్ రన్నింగ్ ట్రాక్ లేకపోవడం.. బురదతో కూడి ఫుట్ బాల్ ఫీల్డ్ మీద ప్రాక్టీస్ చేయడంతో స్టేట్ మీట్ లో కాంస్య పతకం చేజారింది. కానీ అదే ఏడాది చివరిలో జరిగిన జూనియర్ నేషనల్ 100 మీటర్ల ఫైనల్ కు చేరి అందర్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. వెంటనే బ్యాంకాక్ లో జరిగిన ఆసియా యూత్ చాంపియన్ షిప్ కు అర్హత సాధించింది. 200 మీటర్ల పరుగులో 24.52 సెకన్ల టైమింగ్ తో ఏడవ స్థానంలో నిలిచి తాను ఎంచుకున్న దారి సరైందేనని నిరూపించింది. లక్కీగా ఈ టైమింగ్ తో నైరోబీలో జరిగిన వరల్డ్ యూత్ చాంపియన్ షిప్ కు క్వాలిఫై అయ్యింది. ఈ టోర్నీలో 24.31 సెకన్లతో ఐదో స్థానంలో నిలిచింది. మధ్యలో వెన్ను నొప్పి సమస్యలు, గాయాలు ఇబ్బందిపెట్టినా వెనుతిరిగి చూసుకోలేదు.
ఒక్కో మెట్టు అధిగమిస్తూ..
బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో టైమింగ్ ను మెరుగుపర్చుకున్న హిమదాస్.. 2018 గోల్డ్ కోస్ట్ కామన్ వెల్త్ లో మరో మెట్టు ఎక్కింది. 400, 4×400 మీటర్లలో ఫైనల్ కు చేరింది. కానీ 400 మీటర్ల రేస్ లో 51.32 సెకన్లతో ఆరవ స్థానంతో సరిపెట్టుకుంది. కాకపోతే స్వర్ణం గెలిచిన అథ్లెట్ కంటే 1.17 సెకన్లే తక్కువ. 4×400 రేస్ లో 3ని. 33.61 సెకన్లతో ఏడవ స్థానంలో నిలిచింది. 2018 జూలై 12 జరిగిన ఐఏఏఎఫ్ అండర్–20 చాంపియన్ షిప్ స్వర్ణంతో హిమదాస్ కీర్తిపతాకాన్ని ఎగరవేసింది. అదే ఏడాది ఆగస్ట్ లో జరిగిన ఆసియా గేమ్స్ లోనూ తనజోరు చూపెట్టింది. 400 మీటర్ల రేస్ లో 50.79 సెకన్ల టైమింగ్ తో నేషనల్ రికార్డును సవరించింది. నాలుగు రోజుల తర్వాత 4×400లో రజతంతో సత్తాచాటింది. తొలిసారి ప్రవేశపెట్టిన 4×400 మిక్స్ డ్ రిలేలోనూ తన హవా కొనసాగించింది.
20రోజులు.. 5 స్వర్ణాలు
2019 హిమ కెరీర్ స్వర్ణమయం చేసింది. జూలై 2న పోలెండ్ లో జరిగిన పొజానాన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో 200 మీటర్ల రేస్(23.65 సెకన్లు)లో తొలిస్వర్ణం. జూలై 7న కుంటో అథ్లెటిక్స్ మీట్ లో మళ్లీ 200 మీటర్ల రేస్ లో 23.97 సెకన్ల టైమింగ్ తో రెండవ స్వర్ణం, జూలై 13న చెక్ రిపబ్లిక్ లో జరిగిన క్లాడ్ ను అథ్లెటిక్స్ మీట్ 200 మీటర్ల రేస్‌లో 23.43 సెకన్ల టైమింగ్ తో మూడవ స్వర్ణం, రెండు రోజుల తర్వాత జరిగిన తాబోర్ అథ్లెటిక్స్ మీట్ లో నాలుగవ స్వర్ణం, నోవో మెస్టో మీట్ లో 400 మీటర్ల రేస్ లో 52.09 సెకన్ల టైమింగ్ తో ఐదవ స్వర్ణం, యూరోప్ గడ్డపై కేవలం 20 రోజుల్లో ఐదు గోల్డ్ మెడల్స్‌తో భారత ప్రతిష్టను ఇనుమడింపజేసిన హిమాదాస్ యువక్రీడాకారులకు స్ఫూర్తిదాయకం.. ఆమె కృషి క్రీడావనికే మకుటాయమానం.