- ప్రైవేట్ కంపెనీలూ ఉత్పత్తి చేయొచ్చు
- స్టూడెంట్స్ కోసం మనోదర్పణ్
- వంద యూనివర్సిటీల్లో ఆన్ లైన్ కోర్సులు
- రైతులకు నేరుగా రూ.3వేల కోట్లు ఇచ్చాం
- కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్
న్యూఢిల్లీ: బొగ్గు, ఏవియేషన్, స్పేస్, డిఫెన్స్ రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థలు తయారుచేసే ఉత్పత్తులను ప్రైవేట్ కంపెనీలు కూడా ఉత్పత్తి చేయొచ్చని ప్రకటించారు. డిసెంబర్ నాటికి ‘నేషనల్ ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ మిషన్’ను ప్రారంభిస్తామని, లాక్ డౌన్ కారణంగా స్టూడెంట్స్ లో మానసిక సమస్యల పరిష్కారానికి ‘మనోదర్పణ్’ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. కరోనా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే దిశగా స్వయం సమృద్ధి భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని నాలుగు విడతలుగా వివరిస్తున్న మంత్రి, చివరి, ఐదవ విడత ప్యాకేజీ వివరాలను ఆదివారం ఆమె వివరించారు.
మహిళలకు చేయూత
మహిళలకు మొత్తంగా రూ.10,025 కోట్లు ఇచ్చామన్నారు. జన్ ధన్ ఖాతాల ద్వారా 20 కోట్ల మంది మహిళలకు నగదు జమచేశామని తెలిపారు. రైతులకు నేరుగా రూ.మూడువేల కోట్లు ఇచ్చామని, వారి ఖాతాల్లోకి రూ.రెండువేల చొప్పున జమచేశామన్నారు.. వలస కూలీల తరలింపులో 85శాతం ఖర్చును కేంద్రమే భరిస్తోందన్నారు. రూ.50 లక్షల చొప్పున వైద్యసిబ్బందికి బీమా కల్పిస్తున్నట్లు వెల్లడించారు. నిత్యావసర వస్తువుల కోసం రూ.3,750 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్యసేవల కోసం రూ.4,100 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 85 లక్షల ఎన్95 మాస్క్‌లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలు నిర్వహించుకునేందుకు కంపెనీలకు పర్మిషన్ ఇచ్చినట్లు తెలిపారు.
డిజిటల్ క్లాసెస్ కు శ్రీకారం
స్వయంప్రభ డీటీహెచ్ సేవల ద్వారా ఆన్ లైన్ క్లాసెస్ నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్తగా ఈ–విద్య ఆన్ లైన్ చానల్స్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు 4 గంటల పాటు ఆన్ లైన్ క్లాసులు ఉంటాయని తెలిపారు. ఈ-స్కూళ్లలో 200 కొత్త బుక్స్ పంపిణీ చేస్తామన్నారు. ‘వన్ నేషన్ -వన్ డిజిటల్’ ప్లాట్ ఫామ్ కు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. వంద యూనివర్సిటీల్లో
ఆన్ లైన్ కోర్సులకు పర్మిషన్ ఇస్తున్నట్లు ప్రకటించారు. మనోదర్పణ్ స్కీమ్ ద్వారా స్టూడెంట్స్, టీచర్లకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒకటి నుంచి 12 తరగతుల వరకు ఈ -విద్య విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.
‘ఉపాధి’కి రూ.40వేల కోట్లు
గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.40వేల కోట్లు కేటాయించామని చెప్పారు. గత బడ్జెట్ లో రూ.61వేల కోట్లు కేటాయించామన్నారు. ప్రభుత్వ రంగసంస్థల్లో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతిచ్చారు. కంపెనీల యాక్ట్ నుంచి ఏడు నిబంధనలను తొలగించారు. ప్రభుత్వరంగ సంస్థలు తయారుచేసే ఉత్పత్తులను ప్రైవేట్ కంపెనీలు కూడా ఉత్పత్తి చేయొచ్చని ప్రకటించారు. అన్ని రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. విదేశీ ఎక్స్చేంజ్ లలో భారత కంపెనీలు లిస్టింగ్ అయ్యేందుకు అనుమతిచ్చినట్లు ప్రకటించారు.
Full Details : #IndiaFightsCorona, #COVID19, #PMModiLive