Breaking News

పూజారాను ఔట్ చేయాల్సిందే

ఆస్ర్టేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్

సిడ్నీ: టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారాను ఈసారి ఎలాగైనా ఔట్​ చేయాల్సిందేనని ఆస్ర్టేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. అందుకోసం కొత్త మార్గాలు వెతుకుతున్నానని చెప్పాడు. గత సిరీస్ ప్రదర్శనను మరోసారి పునరావృతం చేయనివ్వబోనని స్పష్టం చేశాడు. ‘సాధ్యమైనంత వరకు పుజారా ఎక్కువసేపు క్రీజులో ఉండడానికి ప్రయత్నిస్తాడు. బ్యాటింగ్​లో ఆందోళన చెందడు. ఈ ప్రత్యేకత వల్లే పరుగుల వరద పారిస్తున్నాడు. అందుకే మేం అతన్ని ఔట్ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం.

గత పర్యటన మాదిరిగా ఈసారి జరగనివ్వం. ఇందుకోసం పిచ్​లను మార్చాల్సిన పని కూడా లేదు. కొత్తగా వేటిని తయారు చేయాల్సిన అవసరం లేదు. మా బౌలింగ్​తోనే, మాకున్న వనరులతోనే పుజారాను ఔట్​ చేసేందుకు ప్రయత్నిస్తాం. ఇందులో కచ్చితంగా విజయం సాధిస్తాం. మా వద్ద మరిన్ని కొత్త అస్ర్తాలను సిద్ధంగా ఉన్నాయి’ అని కమిన్స్ పేర్కొన్నాడు. కెరీర్​లో తాను ఆడే ప్రతి టెస్ట్ నుంచి ఏదో ఓ కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నానని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో టెస్ట్​లు బోర్ కొట్టించినా.. మరికొన్ని సార్లు అద్భుతమైన పాఠాలు నేర్పుతాయని చెప్పాడు.