Breaking News

పీవోకేలో ఆందోళనలు

శ్రీనగర్‌‌: పాక్‌ ఆక్రమిత్ కశ్మీర్‌‌ (పీవోకే)లో చైనాకు వ్యతిరేకంగా సోమవారం ఆందోళనలు జరిగాయి. నీలం, జీలం నదులపై అక్రమంగా చేపడుతున్న జల విద్యుత్‌ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ముజఫరాబాద్‌లో అక్కడి ప్రజలు నిరసన చేపట్టారు. ‘సేవ్‌ రివర్స్‌, సేవ్‌ జమ్మూ’ పేరుతో సోషల్‌ మీడియాలో క్యాంపైన్‌ స్టార్ట్‌ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు ఏ ప్రాతిపదికన చేసుకున్నారని నిరసనకారులు ప్రశ్నించారు. ఈ విషయంలో రెండు దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పీవోకేలో దాదాపు 1.5 కోట్ల డాలర్ల విలువైన ఆజాత్‌పత్తాన్‌ జల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబంధించి చైనా–పాక్‌ సోమవారం ఒప్పందంపై సంతకం చేసిన నేపథ్యంలో ఈ నిరసన చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేవరకు నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. చైనా పాకిస్థాన్​లు ప్రతిష్ఠాత్మకంగా భావించిన సీ–పెక్‌లో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు. జీలం నదిపై నిర్మించనున్న 700 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టు వల్ల చవకైన సురక్షితమైన విద్యుత్తు లభిస్తుందని, 2026 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చైనా గతంలో ప్రకటించింది.