Breaking News

పాలమూరుపై కరోనా పంజా

  • ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్​ కేసులు
  • వనపర్తి జిల్లాలో మొదటి కరోనా కేసు
  • అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం
  • బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.. చాప కింద నీరులా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది.. తాజాగా శనివారం పాలమూరు జిల్లాలో రెండు పాజిటివ్​ కేసులు నమోదుకావడం వ్యాధి తీవ్రత, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.. హన్వాడ మండలం వేపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో పాటు భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామానికి చెందిన ఓ వృద్ధుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. వేపూర్​ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తప్పించుకుని తిరుగుతున్నాడని జిల్లా అధికారులకు సమాచారం అందింది. స్వగ్రామానికి రావడంతో అతడిని పట్టుకుని మళ్లీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అమిస్తాపూర్ గ్రామానికి చెందిన సదరు వృద్ధుడు కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ ట్రీట్​మెంట్​ కోసం ఇటీవల హైదారాబాద్ లోని నిమ్స్​కు వెళ్లగా అక్కడి వైద్యులు కరోనా టెస్టు​లు నిర్వహించగా, పాజిటివ్​ అని తేలింది. ఆ ఇద్దరితో పాటు వారి కుటుంబసభ్యులను కూడా వైద్యపరీక్షల అనంతరం హోం క్వారంటైన్​లో ఉంచుతామని జిల్లా అధికారులు చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం రామంతాపూర్​, వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో కరోనా ఛాయలు వెలుగుచూడడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

గ్రీన్​జోన్​లో కరోనా ఛాయలు

మొదటి నుంచీ గ్రీన్​ జోన్​గా ఉన్న వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరు గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా కేసు నమోదుకావడం కలకలం రేపుతోంది. సదరు వ్యక్తికి గాంధీ ఆస్పత్రిలో డాటాఎంట్రీ ఆపరేటర్​గా పనిచేస్తున్నాడు. నారాయణపేట జిల్లా మరికల్​ మండలం జక్లేర్​లోనూ ఓ వ్యక్తిని పాజిటివ్​ రిపోర్ట్​ వచ్చింది. అలాగే ఉమ్మడి జిల్లా షాద్ నగర్, కర్ణాటకలోని రాయిచూర్, యాద్గీర్ ప్రాంతాల్లో కూడా కరోనా కేసులు పెరగడంతో ఆందోళన ఎక్కువైంది. పాజిటివ్​ కేసులు పెరగడానికి ప్రధానంగా నియంత్రణ చర్యల్లో లోపాలే కారణమని తెలుస్తోంది. కేసులు బయటపడ్డ ప్రాంతాల్లో ప్రైమరీ కాంటాక్ట్​లను సైతం హోమ్​క్వారంటైన్​కు రెఫర్ చేస్తున్నారు. వారికి కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపుల నేపథ్యంలో విచ్చలవిడిగా రాకపోకలు పెరగడం, బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లడం, విందువినోదాలు చేసుకోవడం వంటి వాటితో కరోనా వైరస్ కేసులు ఉమ్మడి జిల్లాలో మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ప్రజలు తేరుకుని అప్రమత్తంకాకపోతే, అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే ఆ మహమ్మారి అందరినీ కబళించే ప్రమాదం లేకపోలేదు.

One thought on “పాలమూరుపై కరోనా పంజా”

Comments are closed.