సారథి న్యూస్, మహబూబ్ నగర్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అధికారులు ఆదేశించారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని, వినకపోతే కాంట్రాక్ట్ షిప్ రద్దుచేయాలని సూచించారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావుతో కలిసి కలెక్టరేట్ లో నేషనల్ హైవే, ఆర్అండ్ బీ, మున్సిపల్, పంచాయతీ రాజ్, హౌసింగ్ అధికారులతో సమీక్షించారు.
జిల్లాలో సమష్టి కృషితో కరోనాను నియంత్రించామని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది, డాక్టర్లు, పోలీసులు, కలెక్టర్ ఎంతో శ్రమించారని ప్రశంసించారు. జిల్లాలో రైతుబజార్లు, మొబైల్ రైతు బజార్లు, టెలీ మెడిసిన్, ఎస్సెస్సీ విద్యార్థులకు డిజిటల్ క్లాసెస్ ఏర్పాటు చేశామని వివరించారు. పట్టణంలోని అశోక్ థియేటర్ చౌరస్తా, తెలంగాణ చౌరస్తా వద్ద పనులను పూర్తి చేయాలని సూచించారు. మహబూబ్ నగర్– భూత్పూర్ రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, బ్రిడ్జిలను పూర్తిచేయాలని ఆదేశించారు. మన్యంకొండ దేవస్థానం వద్ద ఫౌంటెయిన్, సెంట్రల్ లైటింగ్, పార్కులు, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఫ్రూట్ మార్కెట్ ప్రారంభం
జిల్లా కలెక్టరేట్ లో లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ ఆఫీసును మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గురువారం ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్, రామయ్యబౌలిలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన రైతు బజార్ లో పండ్ల మార్కెట్ ను కలెక్టర్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ప్రజలకు తాజా మామిడి పండ్లు ఇవ్వాలని సూచించారు. యూరప్ దేశాలకు ఎగుమతి చేసే పండ్లు మన వద్దకే చౌకగా దొరుకుతాయని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్లు మోహన్ లాల్, సీతారామరావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, వైస్ చైర్మన్ గణేష్, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ సురేందర్, హౌసింగ్ పీడీ రమణ, ల్యాండ్ రికార్డ్స్ అధికారి శ్యామ్ పాల్గొన్నారు.