Breaking News

పక్కాలోకల్ భాషతో నాని

పక్కాలోకల్ భాషతో నాని

మాట్లాడేది తెలుగే అయినా భాషలో ఉండే యాస బహు ముచ్చటగా ఉంటుంది. అందులోనూ తెలంగాణ భాష.. ఆ యాసకుండే సొగసే వేరు. ఇంతకు ముందు మన సినిమాల్లో ఈ యాసను విలన్లు ఎక్కువ మాట్లాడేవారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హీరో, హీరోయిన్లు కూడా ఈ యాస పలికే సినిమాలు మస్త్ గా వస్తున్నాయ్. డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలైతే ఎక్కువ శాతం తెలంగాణ యాసతోనే ఉంటాయి. ‘ఫిదా’ సినిమాలో సాయిపల్లవి, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్, వరుణ్ తేజ్ ఈ యాసలో మాట్లాడి మంచి మార్కుల కొట్టేశారు కూడా. ఇప్పుడు మన నేచురల్ స్టార్ నాని ఈ యాసలో డైలాగులు చెప్పేందుకు రెడీ అవుతున్నాడట.

సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేసిన శ్రీకాంత్ ఓడెల అనే కొత్త డైరెక్టర్ కు నాని ఓ సినిమాకు డేట్స్ ఇచ్చాడట. శర్వానంద్ తో ‘పడి పడి లేచె మనసు’ తీసిన చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ సినిమాను తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించనున్నారని, దానికోసం నాని తెలంగాణ యాసలో మాట్లాడాల్సి ఉందని సమాచారం. ప్రస్తుతం నాని ‘వి’ సినిమా పూర్తి చేసి టక్ జగదీష్ లో చేస్తున్నాడు. ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’లో నటించాల్సి ఉంది. వివేక్ ఆత్రేయతోనూ ఓ సినిమా కమిటయ్యాడు నాని. ఇవన్నీ పూర్తయ్యాకే ఈ సినిమా ఉండనుంది. ఏ పాత్రలోనైనా జీవించేసే నాచురల్ స్టార్ నాని.. మరి తన స్టైల్ కు ఈ భాష సూటవుతుందో లేదో చూడాల్సిందే మరి.