Breaking News

న్యూజిలాండ్‌ బెటరేమో

న్యూజిలాండ్‌ బెటరేమో

సిడ్నీ: అందరూ టీ20 ప్రపంచకప్ వాయిదా పడుతుందని భావిస్తున్న తరుణంలో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ కొత్త సలహా ఇచ్చాడు. కరోనాను పూర్తిగా కట్టడి చేసిన న్యూజిలాండ్ లో ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తే బాగుంటుందన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్లో 12 రోజుల నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు. దీంతో జన సమూహాలు, బీచ్ లు, మాల్స్ ను తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో స్టేడియాలకు ప్రేక్షకులకు అనుమతి కూడా ఉంటుందేమోనన్న ఉద్దేశంతో అక్కడే టీ20 ప్రపంచకప్ ను నిర్వహించాలని జోన్స్ భావిస్తున్నాడు.

ఇక టీమిండియా మాజీ, ప్రస్తుత కెప్టెన్లు ధోనీ, విరాట్ పై కూడా జోన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరిని రెచ్చగొట్టి అనవసరంగా ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దన్నాడు. ‘వీళ్లను ఎంత రెచ్చగొడితే అంతా బాగా ఆడతారు. అందుకే అనవసరంగా రెచ్చగొట్టి వాళ్లకు అక్సిజన్ అందించొద్దు. రిచర్డ్స్ బ్యాటింగ్కు వస్తుంటే మేమంతా నిశ్శబ్దంగా ఉండేవాళ్లం. మార్టిన్ క్రో, మియాందాద్‌ కూడా అలాగే ఆడేవాళ్లు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా అదే కోవకు చెందుతారు. వాళ్ల బ్యాటింగ్‌ వాళ్లను చేసుకోనివ్వాలి’ అని జోన్స్‌ వివరించాడు. ఐపీఎల్‌ కాంట్రాక్ట్ ల కోసమే కోహ్లీని ఆసీస్‌ ప్లేయర్లు రెచ్చగొట్టడంలేదన్న మైకేల్‌ క్లార్క్‌ వ్యాఖ్యలను కూడా జోన్స్‌ ఖండించాడు.