న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో 36వ జాతీయ క్రీడలు మరోసారి వాయిదా పడ్డాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో అథ్లెట్ల ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టొద్దనే ఉద్దేశంతో క్రీడలను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అయితే మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే అంశంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 20 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు గోవాలో ఈ క్రీడలు జరగాల్సి ఉన్నాయి.
గతంలో క్రీడల నిర్వహణపై భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ).. గోవా ప్రభుత్వంతో చర్చలు జరిపింది. పోటీల తేదీలను కూడా ప్రకటించేందుకు సిద్ధమైంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్వహణ అంత మంచిది కాదని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించడంతో.. వాయిదాకు మొగ్గు చూపారు. చివరిసారి 2015లో నేషనల్ గేమ్స్ కేరళలో జరిగాయి.