పుణే: కరోనా వచ్చినప్పటి నుంచి తరచూ వినిపిస్తున్న పదాలు మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెంసింగ్. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మాస్క్ కచ్చితంగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో చాలా మంది తమ తమ వెసులుబాట్లను బట్టి ఎన్ 95 మాస్కులు, డీఐవై మాస్కులు, బట్టతో ఇంట్లో తయారుచేసిన మాస్కులను ఉపయోగిస్తున్నారు. అయితే పుణే పింప్రీ–చించ్వాడాకు చెందిన శంకర్ కురాడే అందరిలో కల్లా కొంచెం డిఫరెంట్‌గా ఉండాలనుకున్నాడు. బంగారు మాస్క్‌ను తయారు చేయించుకున్నాడు. రూ.2.89లక్షలు పెట్టి దాన్ని తయారు చేయించుకున్నట్లు ఆయన చెప్పారు. మాస్క్ మొత్తం బంగారంతో చేయించుకున్నానని, చాలా పలుచగా, ఊపిరి ఆడేందుకు వీలుగా చిన్న చిన్న రంధ్రాలు పెట్టించుకున్నానని అన్నారు. అది కరోనా వైరస్‌ను నివారించడంలో ప్రభావం చూపుతుందన విషయం కచ్చితంగా తాను చెప్పలేనని అభిప్రాయపడ్డారు.
తీరొక్క కామెంట్లు
గోల్డెన్ మాస్క్ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు శంకర్ కురాడేపై కామెంట్లు పెడుతున్నారు. అన్ని లక్షలు పోసి ఒక మాస్కు తయారు చేయించుకునే కంటే వాటితో పేదలకు కొన్ని వేల మాస్కులు ఉచితంగా ఇవ్వొచ్చు కదా!అని అంటున్నారు. డబ్బుతో దేనినైనా కొనవచ్చు.. ఒక కామన్‌సెన్స్‌ను తప్ప అని మరో వ్యక్తి కామెంట్ చేశారు. అయితే ఇలాంటి ఖరీదు గల మాస్కులు తయారు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కర్ణాటకకు చెందిన సందీప్ సగోన్కర్ అనే నగల వ్యాపారి తన పెళ్లికి వెండి మాస్కులు తయారు చేశారు. అప్పటి నుంచి వెండి మాస్కులకు డిమాండ్ పెరిగిందని, చాలా మంది దాన్ని స్టేటస్ సింబల్‌గా ఫీలై మాస్కులును ఆర్డర్ ఇస్తున్నారని ఆయన చెప్పారు.