Breaking News

నినదించిన చైతన్యం.. నిస్తేజం!

నినదించిన చైతన్యం... నిస్తేజం!

  • మొన్న ఒకరు.. నిన్న మరొకరు.. నేడు ఇంకొకరు
  • చిన్న చిన్న కారణాలకే పోలీసుల చేతుల్లో
    దళిత యువకులకు చావు దెబ్బలు
  • ప్రశ్నించేవారు లేరు.. అడిగే దిక్కులేదు
  • బాధితుల ఆక్రందనను పట్టించుకునేదెవరు?
  • చర్చనీయాంశంగా నాగర్​ కర్నూల్​ లో వరుస ఘటనలు

సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్​ గడ్డ చైతన్యానికి పెట్టిందిపేరు అని చెప్పుకుంటారు. దివంగత మాజీమంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్ స్ఫూర్తితో ఎన్నో ప్రజాఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. ఆయన శిష్యరికంలో ఎందరో నాయకులు రాటుదేలారు. ఇక్కడ సారా వ్యతిరేక ఉద్యమం, కరువు పోరాటం, కులవివక్ష నిర్మూలన, దండోరా ఉద్యమాలు.. చివరి దశలో తెలంగాణ మహోద్యమం కూడా ఉధృతంగా సాగింది. ఆ చైతన్యం నుంచే ఎంతోమంది నాయకులు ఎదిగారు. ప్రస్తుతం వారంతా కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల్లో కీలక పదవుల్లో ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా మారిన రాజకీయ సమీకరణాల ఫలితామో తెలియదు కానీ ప్రజాఉద్యమాలు చల్లారినట్లే కనిపిస్తున్నాయి. నాడు దళిత గిరిజనులపై ఈగ వాలితే చాలు ప్రశ్నించి నిగ్గదీసిన గొంతుకలు నేడు గమ్మున్న పడి ఉన్నాయి. టీఆర్ఎస్ లో దళిత సామాజికవర్గానికి చెందిన నేతలుగా మంగి విజయ్, జెట్టి ధర్మరాజు, జోగు ప్రదీవ్, ఇంద్రకల్ వెంకటయ్య, జడ్పీ చైర్‌పర్సన్ భర్త బంగారయ్య, కాంగ్రెస్ పార్టీలో దేవరకొండ రామచందర్, లక్ష్మయ్య, బీజేపీలో గుమ్మకొండ భూషయ్య, బీఎస్పీలో బి.కుమార్, బండి పృథ్వీరాజ్, సీపీఎంలో అంతటి కాశన్న, ఎమ్మార్పీఎస్ లో కరిగేలా దశరథం, గూట విజయ్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస్ బహదూర్ దళిత నేతలుగా చెలామణి అవుతున్నారు.

ఇవిగో వరుస ఘటనలు
ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంటున్న కొన్ని ఉదంతాలను పరిశీలిస్తే నాటి చైతన్యం నిస్తేజం అయ్యిందనే విషయం స్పష్టమవుతుంది. జడ్పీ చైర్ పర్సన్ కొడుకుపై బిజినేపల్లి ఎస్సై దాడి ఘటన నేపథ్యంలో ప్రశ్నించే గొంతుకలపై చర్చ నడుస్తోంది. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన జడ్పీ చైర్‌పర్సన్ పద్మావతి కుమారుడు గణేశ్ ఈ నెల 20న మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లికి వస్తుండగా ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి వెహికల్ ఆపి నానాదుర్భాషలాడారు. స్టేషన్ కు తీసుకెళ్లి బూటికాలితో తన్నాడని ఎస్పీకి బాధితుడు ఫిర్యాదు చేశాడు. మంత్రిహోదా కలిగిన తన కుమారుడికే ఇలా జరిగితే జిల్లాలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటీవల ఇసుక రవాణా విషయంలో తెల్కపల్లి ఎస్సై ప్రదీప్ రామగిరికి చెందిన దళిత యువకుడు మద్దెలబండ శ్యాంసుందర్‌ను చితకబాదారు. అతనికి చావు ఒక్కటే తక్కువైంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఓ కేసు విషయంలో మధ్యవర్తిగా వెళ్లిన దళిత యువకుడు చెన్న మాధవులును తిమ్మాజీపేట ఎస్సై శంషోద్దీన్ విచక్షణారహితంగా కొట్టారు. తాను న్యాయం కోసం హైకోర్టును దాకా వెళ్లారు. కోర్టు అట్రాసిటీ కేసు నమోదు చేయమని చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేపై బీజేపీ నేతలు అనుచిత ఆరోపణలు చేశారని.. రోడ్డెక్కి దిష్టిబొమ్మలను దహనం చేసిన టీఆర్ఎస్ లోని దళిత నాయకులు నియోజకవర్గంలో అదే సామాజికవర్గానికి చెందిన అమాయక యువకులపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నించారు. కాగా, ఇటీవల బిజినేపల్లి ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ పై ఫిర్యాదు ఇచ్చిన క్షణాల్లోనే అట్రాసిటీ కేసు నమోదుచేసిన పోలీసు అధికారులు, కోర్టు సూచించినా, జడ్పీ చైర్ పర్సన్ నేరుగా ఫిర్యాదుచేసినా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. మనిషికో న్యాయమా? అని నిలదీస్తున్నారు.