Breaking News

నా కెరీర్ రెండేళ్లు పెరిగింది

నా కెరీర్ రెండేళ్లు పెరిగింది

న్యూఢిల్లీ: అనుకోకుండా వచ్చిన కరోనా బ్రేక్ వల్ల తన కెరీర్​ను మరో రెండేళ్లు పొడిగించుకునే అవకాశం వచ్చిందని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ అన్నాడు. పక్కటెముక గాయంతో జనవరిలో ఆటకు దూరమైన అండర్సన్.. ఈ విరామంలో పూర్తిగా కోలుకున్నాడు. దీంతో గతవారం నుంచి బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ‘మళ్లీ క్రికెట్ మొదలుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ప్రేక్షకులు లేకుండా కేవలం నెట్స్​లోనే ప్రాక్టీస్ చేస్తున్నందుకు కొంత అసంతృప్తిగా ఉంది.

ఈ రెండింటిలో కామన్​గా ఉన్నది క్రికెట్ మొదలవ్వడం. ఇది బాగా సంతృప్తినిస్తోంది. అయితే ఈ విరామం వల్ల నేను బాగా కోలుకున్నా. కాబట్టి మరో రెండేళ్లు కెరీర్​ను పెంచుకునే అవకాశం వచ్చింది’ అని అండర్సన్ పేర్కొన్నాడు. స్టేడియంలో ప్రేక్షకులు ఉంటే వాతావరణం భిన్నంగా ఉంటుందన్నాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదిసాధ్యం కాదు కాబట్టి ఎవరూ లేకుండా ఆడేందుకు అలవాటు పడాల్సిందేనన్నాడు. చూసేందుకు బాగానే ఉన్నా.. లోలోపల ఏదో కోల్పోయామనే బాధ మాత్రం ఉంటుందని ఈ స్టార్ పేసర్ వ్యాఖ్యానించాడు.