తెలుగు సినీ పరిశ్రమలో తీరని విషాదం. ప్రతినాయకుడిగా, కమెడియన్‌గా, తండ్రిగా, మామగా, తాతగా.. ఇలా విభిన్న పాత్రలు పోషించి.. మెప్పించి తెలుగు సినీపరిశ్రమలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాష్ రెడ్డి కన్నుమూశాడు. మంళవారం ఉదయం 7 గంటలకు గుంటూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచాడు. బాత్రూమ్లో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ప్రాణాలు వదిలాడు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని శిరువెళ్ల గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. జయప్రకాష్‌రెడ్డి తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసేవారు. నెల్లూరులోని పత్తేకాన్‌పేట ప్రైమరీ స్కూలులో 1 నుంచి 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట హైస్కూలులో చేరాడు. పదవ తరగతిలో ఉండగా వాళ్ల నాన్నకు అనంతపురం బదిలీ కాగా, కుటుంబమంతా అక్కడికి వెళ్లింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదివాడు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆయనకు ఆసక్తి. తండ్రి కూడా నటుడే కావడంతో ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అడ్డుచెప్పేవారు కాదు. డిగ్రీ తర్వాత టీచర్‌గా శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు.
ఓ సారి జయప్రకాశ్ రెడ్డి నల్లగొండలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. దీంతో ఆయన 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు. 1997 లో విడుదలైన ‘ప్రేమించుకుందాం రా..!’ చిత్రం ప్రతినాయకుడిగా అతడిని స్టార్ డమ్‌కు తీసుకెళ్లింది. బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ వంటి విజయవంతమైన సినిమాల్లో విలనిజం పండించాడు. జయప్రకాష్‌రెడ్డి పెద్ద హీరోల నుంచి యువహీరోల వరకు దాదాపు అందరితోనూ కలిసి నటించాడు. ఇలా ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్ లు లేకపోవడంతో గుంటూరులో ఉంటున్నాడు.
రాయలసీమ మాండలీకంతో విలనిజం పండించిన నటుడు జయప్రకాష్ రెడ్డి ఇక లేరన్న వార్త ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచింది. ‘ప్రేమించుకుందాం రా..!’ ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’ సినిమాల్లో ఆయన విలనిజం జేజేలు పలికించుకుంది. అల్లరి నరేష్‌తో కలిసి పండించిన కామెడీ ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఆయన మృతిపట్ల పలువురు సీనిప్రముఖులు, హీరోలు, హీరోయిన్లు, కామెడియన్లు సంతాపం తెలిపారు. జయప్రకాష్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.