Breaking News

నంద్యాల ఎస్పీవై ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్​

నంద్యాల ఎస్పీవై ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్​
  • ఒకరి మృతి.. పలువురికి అస్వస్థత
  • సంఘటనస్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ, జేసీ

సారథి న్యూస్, కర్నూలు: విశాఖపట్నం ఆర్‌ఆర్‌ వెంకటాపురం గ్రామంలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనను మరవక ముందే కర్నూలు జిల్లా నంద్యాలలో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. శనివారం నంద్యాలలోని ఏస్పీవై ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో గ్యాస్​లీక్​అవడంతో ఒకరు మృత్యువాతపడ్డారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్‌ పైప్​ లీకై బ్లాస్ట్‌ కావడంతో ఫ్యాక్టరీ మేనేజర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మృతిచెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన ఫ్యాక్టరీ వద్దకు వచ్చి అక్కడ పనిచేస్తున్న కూలీలను బయటకు తీశారు. కొందరిని వైద్యచికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఫ్యాక్టరీ నుంచి 15 రోజుగా గ్యాస్‌ లీక్‌ అవుతోందని ఫ్యాక్టరీ యాజమాన్యం, పొల్యూషన్​కంట్రోల్‌ బోర్డు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని, దీంతో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు, కార్మికులు ఆరోపించారు.

పరిశీలించిన కలెక్టర్‌, జేసీ, ఏజేసీ
నంద్యాలోని ఎస్పీవై ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీలో దురదృష్టవశాత్తు అమ్మోనియా గ్యాస్‌ ప్రెజర్‌ తో పైపు లీకై బ్లాస్ట్‌ అయిందని, దీంతో ఈ ఘటన చోటుచేసుకుందని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అన్నారు. శనివారం నంద్యాల సమీపంలో ప్రమాదం జరిగిన ఎస్పీవై ఆగ్రో కెమికల్‌ ఫ్యాక్టరీని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ తో పాటు, జిల్లా ఎస్పీ కె.ఫకీరప్ప, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి, జేసీ రవిపట్టన్‌ శెట్టి, జేసీ-3 సయ్యద్‌ ఖాజామోహిద్దీన్‌ తదితరులు స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అగ్నిమాపకశాఖతో పాటు రెస్క్యూ టీం, రెవెన్యూ, పోలీస్‌, జిల్లా అధికార యంత్రాంగం సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.