న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్. ధోనీ రిటైర్మెంట్ విషయం మరోసారి చర్చకు వస్తున్న వేళ.. భారత జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో ఎంతో సాధించిన మహీకి.. ఎప్పుడు రిటైర్ కావాలో తెలుసన్నాడు. ఇందులో ఎవరూ బలవంతం చేయాల్సిన అవసరం లేదన్నాడు. తన వీడ్కోలు విషయంలో నిర్ణయం తీసుకునే హక్కును అతను సంపాదించుకున్నాడని స్పష్టం చేశాడు.
‘ధోనీ అద్భుతమైన క్రికెటర్. అతని మేధస్సు, ప్రశాంతత, పవర్, అథ్లెటిక్స్ నైపుణ్యం, వేగం అతన్ని అందరిలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఆధునిక యుగంలో దిగ్గజ క్రీడాకారుల్లో ధోనీ ఒకడు’ అని గ్యారీ వ్యాఖ్యానించాడు. కోచింగ్‌తో పోలిస్తే క్రికెట్ ఆడటమే అతిపెద్ద సవాలన్నాడు. ‘టీమిండియాకు కోచ్‌గా పనిచేయడం నాకు చాలా ఇష్టం. చాలా గౌరవంగా భావిస్తా. కుర్రాళ్లతో పోలిస్తే సచిన్‌కు కోచింగ్ ఇవ్వడం చాలా సులువు. ఎందుకంటే గొప్ప విలువలున్న ప్లేయర్. మనం చెప్పాల్సిన పనిలేదు. అన్ని వాటంతట అవే వచ్చేస్తాయి. 2011లోనే విరాట్ గొప్ప ఆటగాడు’ అని గ్యారీ చెప్పుకొచ్చాడు. టీమిండియాకు కోచింగ్ ఇచ్చేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని వెల్లడించాడు.