Breaking News

ధోని వల్లే ఎదిగా: కోహ్లీ

న్యూఢిల్లీ: మాజీ సారథి ధోనీ వల్లే తాను అంతర్జాతీయ క్రికెట్​లో ఎదిగానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. దాదాపు ఆరు, ఏడు ఏళ్ల పాటు మహీ తనపై దృష్టిపెట్టడంతోనే ఇదంతా సాధ్యమైందన్నాడు. రాత్రికిరాత్రే తాను కెప్టెన్ కాలేదని స్పష్టం చేశాడు. ‘ఓ క్రికెటర్​గా నాకంటూ ఓ ఆటతీరు ఉంటుంది. కానీ కెప్టెన్​గా ఎలా? అందుకే ధోనీ నన్ను చాలా కాలం పాటు దగ్గరి నుంచి గమనించాడు. మ్యాచ్​లో నా బాధ్యతల నిర్వహణ, ఆటతీరును, సహచరులతో ప్రవర్తన.. ఇలా అన్ని అంశాలను పరిశీలించాడు. ఈ మ్యాచ్​లో ధోనీ లేడు కాబట్టి నీవు కెప్టెన్సీ చేయమని నాకెవ్వరూ చెప్పలేదు. నా తర్వాత కెప్టెన్​గా ఈ వ్యక్తి పనికొస్తాడని మహీ గుర్తించడం వల్లే ఇది సాధ్యమైంది. ఆ తర్వాత నెమ్మదిగా మార్పు మొదలైంది.

ఈ మార్పు కూడా ఒక్క రోజులో జరగలేదు. భవిష్యత్​ ను దృష్టిలోఉంచుకుని ధోనీ ఎప్పుడూ నన్ను అతనికి దగ్గరలోనే ఫీల్డింగ్​లో ఉంచుకునేవాడు. ఏదైనా ఓ సందర్భంలో ‘ఇప్పుడు ఏం చేద్దాం, బౌలింగ్​లో మార్పులు ఏమిటి.. ఇలా కొన్ని విషయాలను చర్చించేవాడు. ఆ చర్చల్లో చాలాసార్లు నా నిర్ణయాలతో విభేదించినా.. వాటివల్లే నేను కెప్టెన్సీకి పనికొస్తాననే నమ్మకాన్ని ఏర్పర్చుకున్నాడు. ఆ నమ్మకమే చివరకు నన్ను కెప్టెన్​ చేసింది. నేను కెప్టెన్సీ తీసుకున్న తొలినాళ్లలోనూ నాకు అండగా నిలిచేవాడు. కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా.. వాటిని సరి చేస్తూ నా కెరీర్ ఎదుగుదలకు దోహదపడ్డాడు. అందుకే ధోనీ నాకు సహచరుడి కంటే ఎక్కువ’ అని స్పిన్నర్ అశ్విన్​తో జరిగిన ఇన్​స్టాగ్రామ్​ చర్చలో కోహ్లీ వ్యాఖ్యానించాడు. తనకు గ్రహంతరవాసుల గురించి తెలుసుకోవడం ఆసక్తి అని చెప్పిన విరాట్.. ఎగిరే పళ్లాలు (యూఎఫ్ వో)లను చూడాలన్నది తన లక్ష్యమన్నాడు.