Breaking News

దేదీప్యమానంగా తెప్పోత్సవం

దేదీప్యమానంగా తెప్పోత్సవం

సారథి న్యూస్, మానవపాడు(అలంపూర్): తెలంగాణలోనే ప్రఖ్యాతిచెందిన ఐదవ శక్తిపీఠం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామివారి ఆలయంలో ఆదివారం దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దేదీప్యమానంగా తెప్పోత్సవం జరిగింది. ఆలయ సమీపంలోని తుంగభద్ర నదిలో హంస వాహనంపై ఆదిదంపతుల(స్వామి, అమ్మవారు) తెప్పోత్సవ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించగా.. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ‘జై జోగుళాంబ, జై బాలబ్రహ్మేశ్వరా!’ అంటూ భక్తులు జయజయధ్వానాలు పలికారు. అంతకుముందు స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఆలయాల నుంచి ఊరేగింపుగా పల్లకీలో నది వద్దకు తీసుకొచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఈ మహాఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. చంద్రుని చల్లని నీడలో ఆదిదంపతుల తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలొచ్చారు. ఆలయ సమీపంలోని తుంగభద్రలో నదీ హారతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. అలంపూర్​ఎమ్మెల్యే అబ్రహం, జోగుళాంబ గద్వాల జడ్పీ చైర్​పర్సన్​ సరిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. ఎలాంటి అవరోధాలు లేకుండా సామరస్యంగా విజయదశమి రోజున అమ్మవారి తెప్పోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు పోలీసులు, ఆలయ అర్చకులను ప్రశంసించారు. ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.

విద్యుత్​ కాంతుల్లో దేదీప్యమానంగా వెలిగిపోతున్న అలంపూర్​ జోగుళాంబ ఆలయం
ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ చైర్​పర్సన్​ సరితకు ఘనస్వాగతం పలుకుతున్న ఆలయ అధికారులు, అర్చకులు
అమ్మవారు, స్వామివారికి ప్రత్యేకపూజలు చేస్తున్న ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ చైర్​పర్సన్​ అనిత