Breaking News

దళితుల భూములు గుంజుకుంటే దండయాత్ర చేస్తం

దళితుల భూములు గుంజుకుంటే దండయాత్ర చేస్తం

సారథి న్యూస్, మహబూబ్ నగర్: తాత, ముత్తాతల నుంచి దళితుల చేతుల్లో ఉన్న సాగు భూములను గుంజుకుంటే సర్కారుపై దండయాత్ర తప్పదని మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. శనివారం రాత్రి ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్ లో రిలే దీక్షలు చేపట్టిన బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని మాట తప్పారని, 17శాతం ఉన్న దళితులకు ఒక్క మంత్రి పదవి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు.

దళితులకు మూడెకరాల భూమిని మేనిఫెస్టోలో పెట్టి గాలికొదిలారని విమర్శించారు. రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికల పేరుతో దళితుల అసైన్డ్, ఇనాం భూములను లాక్కుంటున్నారని తెలిపారు. ఇప్పటికే దాదాపు రెండు లక్షల ఎకరాలు లాక్కునే ప్రణాళికలు వేశారని తెలిపారు. రెండు నెలలుగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్న తనకు ప్రతి ఊరులోనూ దళితుల కన్నీటి గాథలు వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాబేయె ఎన్నికలలో మహాజన సోషలిస్టు పార్టీని అధికారంలోకి తెస్తే దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని, భూమి లభ్యం కాని చోట పేదలకు రూ.30 లక్షలు డిపాజిట్ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీస్ రాష్ట్ర నాయకుడు కావలి కృష్ణయ్య, టైగర్ జంగయ్య, మాదిగ ఉద్యోగ సంఘం నాయకులు గాలి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.