తరతరాల తెలుగు.. ఇలా వెలుగు
ఏ ప్రపుల్ల సుమంబుల ఈశ్వరునకు
పూజ సల్పితినో యేను పూర్వమందు
కలదయేని పునర్జన్మ కలుగుగాక
మధుర మధురమౌ తెలుగు నా మాతృభాష!!
– అని రాయప్రోలు సుబ్బారావు తేట తెలుగు మాధుర్యాన్ని
తీయనైన పద్యం ద్వారా చెప్పారు.
ఆయనే ఓ మాట అన్నారు..‘ఏ దేశమేగినా.. ఏ పీఠమెక్కినా పొగడరా నీతల్లి భారతిని’ అని ఆ వాక్యాన్ని కాస్తా తెలుగుకు అన్వయించుకుంటే మనం ఎక్కడున్నా, రెండు రాష్ట్రాల వారమైనా తెలుగు వారమే. ఆ భాషా మాధ్యుర్యాన్ని తొలి గురువు అమ్మనోట విని పులకించినవారమే. దాన్ని నిరంతరం ఏ వేదిక ఎక్కినా కొనియాడి తీరాల్సిందే. ప్రభుత్వం చట్టం చేసినా, సాహితీ సంకల్పాలు చెప్పుకున్నా భాషను ప్రేమించాలి..అది మనతో పాటు చివరి ఘడియ వరకూ ప్రయాణించాలి, శ్వాసించాలనే భావన తొలుత కుటుంబాల్లో ప్రారంభం కావాలి. ఆంగ్లమాధ్యమ చదువులకు అలవాటు పడడమే కాకుండా ఆ సంస్కృతినీ జీర్ణించుకుంటున్న తెలుగు కుటుంబాల్లో ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో భాషా ప్రేమికులను పెంచాల్సిన అవసరం ఉంది. బంధుత్వాలు సైతం తెలుగు పిలుపులకు నోచుకోవడం లేదు.
మనకు తల్లి, తండ్రి తరఫు బంధువులను స్పష్టంగా విభజించే చక్కని వరుసలు ఉన్నాయి. ఇదే ఆంగ్ల సంస్కృతిలో లేదు. ఇప్పుడు తెలుగు పిలుపులే అంతరించి పోయి ఆత్మీయతను కోల్పోతున్నాయి. అంటే ఒక విధంగా ఇది సున్నితమైన సాంస్కృతిక పరిణామక్రమ అంశమే. మన మనుగుడకు బీటలు దేరుతున్న వ్యవహారమే. అయితే ఇలా అనుకోని విధంగా ఆంగ్లానికో, ఇతరత్రా అన్యభాషా పదాలకో అలవాటుపడుతున్న ఓ తరం మరో తరానికి తీసుకెళ్లేది వాటినే. దీన్ని మనం గుర్తించి తెలుగుదనం ఇళ్లల్లో నింపే చర్యలను తక్షణం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకు విస్తృత ప్రచారం, తెలుగు భాషలో ఇమిడి ఉన్న భావవ్యక్తీకరణ గొప్పదనం కింది స్థాయికి వెళ్లేలా చెప్పగలగాలి. భాషా ప్రేమికులు, సాహితీకారులను గుర్తించి కుటుంబాల నుంచే తెలుగుకు పునాది పడేలా చర్యలకు ప్రోత్సహించాలి. తెలుగు అవసరం దైనందిన జీవితంలోనూ తప్పనిసరే అనే భావన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెంపొందించాలి. అది తప్పని సరైనప్పుడే దాన్ని పాటించే నైజం మానవ సహజం. అందుకే భాషా ప్రేరణను పెంచాలి.
పల్లెల వల్లే ఆ మాత్రమైనా..
ఇప్పటికీ తెలుగు.. మాండలికాలు, చక్కని వ్యక్తీకరణతో బతికి ఉందంటే అది కేవలం పల్లెజనుల కృషి అని చెప్పాలి. ఇప్పటికీ చెదిరిపోని తెలుగు వాతావరణం ఇరు రాష్ట్రాల్లోని పల్లెసీమల్లో కాసింతైనా కనిపిస్తోంది. అందుకు పల్లెలను మనం అభినందించడంతో పాటు వారు మరింతగా దాన్ని నిలబెట్టుకునే విధంగా వెన్నుతట్టి ప్రోత్సహించాలి. ఈ రోజుకూ తెలుగు పద్యాలను అభిమానించే వారు మనకు పల్లెల్లోనే కనిపిస్తారు. తెలుగు పద్యాన్ని వర్ణిస్తూ వేమన కవి చెప్పిన పద్యం..
నిక్కమైన మంచినీల మొక్కటి చాలు
తళుకు బెళుకు రాళ్లు తట్టెడేల
చాటు పద్యమిలను చాలదా ఒక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ..!!
అన్నాడు. ఇది పద్యం ఒక్క గొప్పదనాన్ని చెబుతున్నది. ఇప్పటికీ గ్రామసీమల్లో సత్యహరిశ్చంద్ర, శ్రీకృష్ణరాయబారం, చింతామణి నాటకాల్లోని పద్యాలు పల్లె జనుల నోట అలవోకగా రాగాలు అందుకుంటూ ఉంటాయి. భారత, భాగవత అంశాలతో పాటు, గ్రామీణుల విశేష కళా ప్రక్రియలైన ఒగ్గు కథలు, జంగాల పాట, గొల్ల సుద్దులు, హరికథలు, బుర్రకథలు వంటివి పల్లెల్లోనే బతుకుతున్నాయి. ఇది వారి భాషా ప్రేమను చెప్పడమే కాకుండా ఇంకా ఆంగ్లీకరణ ప్రభావం అక్కడ తాకకుండా ఉండడం కొంత కారణం కావచ్చు. దీన్ని మరింతగా పెంపొందించి జానపద కళారూపాలు, పద్యానికి పెద్దపీట వేసి ఆ అభిమానులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వైభవ గతాన్ని గుర్తుచేసుకుని మురిసిపోయే కంటే వర్తమాన ఆవశ్యకతను తెలుసుకుని మన తెలుగు, ఆ సంస్కృతి ఎప్పటికీ చెదిరిపోకుండా చూడాల్సిన అవసరం ఈ ప్రభుత్వాలతో పాటు ఈ తరం వారిపై ఉంది. ఇందుకు మధ్యస్థ తరం వారు కంకణ బద్ధులై పనిచేయాల్సిన అవసరం ఉంది.
సీపీ బ్రౌన్ స్ఫూర్తి అవసరం
నిజంగా తెలుగు నేలకు బ్రిటిషు దొర సీపీ బ్రౌన్ (1798–1884)పరిచయం కాకుండా ఉంటే విలువైన వేమన సాహిత్యం మనకు దక్కేది కాదేమో. జాతి. ప్రాంతం, మతానికి అతీతంగా మన భాషను ప్రేమించి చివరికి లండన్ వెళ్లాక కూడా అందులోనే జీవించిన మహనీయుడు. ఆయన మద్రాసుకు ఉద్యోగ రీత్యా రిపోర్టు చేసేందుకు వచ్చేంత వరకూ తెలుగు అనే భాష ఉందనే ఎరుగనివాడు. అలాంటి వ్యక్తి తన పాలనా సౌలభ్యం కోసం ఓ సీనియర్ అధికారి ఇచ్చిన సూచన మేరకు తెలుగు నేర్చుకొని తెలుగుకే కొత్త వెలుగు తెచ్చాడు. ఇందుకు సాక్ష్యం ఏపీలోని కడప జిల్లా కేంద్రంలోని బ్రౌన్ గ్రంథాలయమే. ఆయన నివాసం ఉన్న బంగ్లాను గుర్తించి గ్రంథాలయంగా మార్చి సాహితీవేత్త స్వర్గీయ జానుమద్ది హనుమచ్ఛాస్త్రి తెలుగు ప్రజలకు ఒక కానుకగా ఇచ్చారు. ఇక బ్రౌన్ భాషా కృషివల్లే అనేక సాహితీ గ్రంథాలు, ముఖ్యంగా వేమన పద్యాలు మనకు దక్కాయి. ఇలాంటి భాషా ప్రేమను మనం ఉద్యమ స్ఫూర్తితో పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలకు ప్రబోధించాల్సిన అవసరం, అగత్యం ఉంది.
ఇలా పరిఢవిల్లాలి
తెలుగు.. అమ్మ భాష. అందులోని యాస.. అద్భుత శ్వాస. మాండలికాలు మన మనుగడకు మూలకారణాలు. ఓ విధంగా తెలుగు వాడి లోగిలిని తట్టి చెప్పే మాతృకలు. ఇది తరతరాలకూ కొనసాగాల్సిన తెలుగు సాగరం. ఎన్నో రూపాంతరాలు చెంది, గిడుగు రామ్మూర్తి పంతులు వంటి మహానుభావుల కృషివల్ల సామాన్యుని భాషకు పెద్దపీట పడి అది పరిఢవిల్లక ముందే అంతరించి పోయే భాషల జాబితాలోకి చేరుతోందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కళాశాల చదువుల్లో దిట్టలు అనిపించుకుని మార్కుల మర్తాండులైన మన పిల్లలను కదిపితే చాలు ఇది వాస్తవమేమో అని పించక మానదు. మరి కొన్నాళ్లకు కమ్మనైన తెలుగును మరచిపోయి కల్తీ భాషనే అసలుదిగా భ్రమించి దాన్నే ఆ ముందటి తరాల వారికి అందించాల్సిన దుస్థితి పడుతుందేమో అన్న భయం వ్యక్తమవుతోంది.
కార్పొరేట్ మాయ
కార్పొరేట్ మాయలో పడిన మనం అసలు తెలుగును అంతర్థానం అయ్యేలా చేస్తున్నామనిపిస్తోంది. ఇప్పటి పిల్లల్లో ఓ 60శాతం మందికి పైగా ద్విత్వాక్షరాలు రాయలేరు. చక్కని పదబంధం మకూర్చుకోలేకపోతున్నారు. కొందరు అక్కడక్కడా ప్రహేళికలు వంటివి చేయాలని తపిస్తున్నా అవి సినిమా పేర్లు చెప్పినంత కచ్చితంగా తెలుగు పదాలు, పేర్లు, మాసాలను గుర్తించలేక పోతున్నారు. కొందరు వారాలు పేర్లే చెప్పడం లేదు. దీనికి అంతటికీ మూలం ఆధునిక అవసరాలు అని సరిపుచ్చుకున్నా మన సోదర రాష్ట్రాలైన ఒడిశా, ఇటు తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాలు రాష్ట్రాల్లో ఈ దుస్థితి లేదు. వారు వారి మాతృభాషను హాయిగా నేర్చుకుంటున్నారు. మాట్లాడుతున్నారు. ఏ ఇద్దరు తెలుగు వారు కనిపించినా అలవోకగా ఆంగ్లభాషా పదాలు దొర్లడమో అందులోనే భాషించడమో అలవాటుగా మారిపోతోంది. అందుకే అన్యభాషా పదాలు తెలుగులో ఇమిడి పోయాయి. కొన్ని వాక్యాలే ఆంగ్లపదాలతో నిండి అందులో మధ్యలో తెలుగు చేరుతోంది. చివరికి అదే అసలైన భాషగానో, వ్యవహారికంగానో మారిపోతున్నాయి. ఈ జాడ్యాన్ని మనం ఎంత త్వరగా చక్కదిద్దగలిగితే అంత త్వరగా మన భాషను మనం బతికించుకో గలం. లేకుంటే ప్రమాద ఘంటికలు మోగడమే కాదు.. మన భాషను మింగేసే ప్రమాదం ఉంది.
యుద్ధమే శరణ్యం!
తెలుగును పరిరక్షించుకోడానికి యుద్ధమే చేయాలి.. అంటే వీధి పోరాటాలు కాదు గానీ అంతటి స్థితినైతే కల్పించాలి. మనకు ఇరురాష్ట్రాల్లోనూ తెలుగు అకాడమీ, తెలుగు భాషా సంఘం వంటి సంస్థలు ఉన్నాయి. ఇవి వాస్తవానికి ఉత్సవ విగ్రహాలు లాంటివి. కేవలం సలహా సంఘాలుగా మిగిలి పోతున్నాయి. ముఖ్యంగా తెలుగు అధికార భాషా సంఘానికి కనీసం పాక్షిక న్యాయనిర్ణయాధికారం కట్టబెట్టాలి. ఓ రిటైర్డ్ న్యాయమూర్తికో, లబ్దప్రతిష్టుడైన న్యాయకోవిదుడికో నాయకత్వ బాధ్యతలు కట్టబెట్టాలి. మహిళలను ఇందులో ప్రధాన భాగం చేయగలిగినప్పుడు ఇంట్లోనే తెలుగు వాతావరణం పరిపుష్టమవుతుంది. భాషా బోధకులు, అందుకు కృషిచేసిన వారికి విస్తృతంగా ప్రోత్సాహకాలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సాయం అందించాలి. మరోవైపు ఇతర సాంకేతికతనూ అందిపుచ్చుకొని అది తెలుగులోనే వినియోగమయ్యేలా నవీకరించాలి. మరోవైపు ప్రతి జిల్లాలోని మాండలికాలను ప్రోత్సహించేలా రచనలు రావాలి. నిర్దిష్ట ప్రాంత భాషే ప్రామాణికమన్న భావన కాకుండా అన్ని జిల్లాల తెలుగు సొగసునూ ఆస్వాదించేలా ఉండాలి. ఇదో యజ్ఞం. తరతరాలకు తరగని సంపద. అద్భుతమైన భాషా సాగర అలలు తెలుగు తల్లిని నిత్యం అభిషేకించేలా కృషి జరిగితేనే తెలుగుదనం పదికాలాల పాటు నిలుస్తుంది. తెలుగు భాష సజీవంగా నిలుస్తుంది. ఎప్పటివాడో.. ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు నేటికీ మనకు ప్రాతఃస్మరణీయుడుగా ఉన్నాడంటే ఆయన తెలుగును పెంచి పోషించిన తీరే కారణంగా గుర్తెరగాలి. అలాగే మన వేమన, అన్నమయ్య, గురజాడ, గిడుగు, ఆరుద్ర, శ్రీశ్రీ , సినారె, బూదరాజు రాధాకృష్ణ, పాల్పురికి సోమనాథుడు, మల్లెనాథ సూరి, సినారె, దాశరథి, కాళోజీ వంటి మహనీయులు సాగించిన తెలుగు భాషా సేవను తెలుగుజాతి వెలిగే వరకూ ఉప్పొంగేలా చూడాలి.
:: పట్నాయకుని వెంకటేశ్వరరావు,
సీనియర్ జర్నలిస్టు, కవి, కథా రచయిత
సెల్నం.97053 47880