Breaking News

తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించండి

తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించండి

సారథి న్యూస్​, అలంపూర్​: నవంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలు విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరుతూ జిల్లా బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి దిండిగల్​ ఆనంద్ శర్మ ఎమ్మెల్యే అబ్రహంకు వినతిపత్రం సమర్పించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యేను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తుంగభద్ర నది ప్రవహించేది ఒక అలంపూర్​ నియోజకవర్గంలో మాత్రమేనని వివరించారు. ప్రధానంగా వేడి సోంపురం, అలంపురం, రాజోలి, పుల్లూరు వంటి నది పరీవాహక ప్రాంతాల్లో ఏర్పాట్లు చేయాలని కోరారు. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టాలని కోరారు.

అనంతరం ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ తుంగభద్ర పుష్కరాల విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అనంతరం జోగుళాంబ ఆలయ ఈవో ప్రేమ్ కుమార్ కు ఫోన్ చేసి పుష్కరాల ఏర్పాట్లపై ఇప్పటిదాకా దేవాదాయశాఖ ఇలాంటి చర్యలు చేపట్టిందో తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో దూప దీప నైవేద్య అర్చకుల సంఘం అధ్యక్షుడు నరేంద్రాచార్యులు ఉన్నారు.