Breaking News

టెన్త్​ స్టూడెంట్స్​కు గ్రేడింగ్​ గుబులు

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 8 నుంచి జరగాల్సిన టెన్త్​ ఎగ్జామ్స్ ను రద్దుచేసిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్​ సాధించిన ఇంటర్నల్​ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ వివరాలు బోర్డుకు చేరకపోవడంతో టెన్త్​ స్టూడెంట్స్​కు గ్రేడింగ్​ గుబులు పట్టుకుంది. వివరాలను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌కు ఆన్‌లైన్‌లో పంపించుకుండా స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో టెన్త్​ స్టూడెంట్స్​లో ఆందోళన నెలకొంది. కిన్నెరసాని క్రీడా ఆశ్రమ బాలుర పాఠశాల(స్పోర్ట్స్​ స్కూలు)లో 76 మంది టెన్త్​ స్టూడెంట్స్​ చదువుతున్నారు. వారికి జులై, ఆగస్టు, నవంబర్​, ఫిబ్రవరిలో ఎఫ్‌ఏ(ఫార్మెటివ్​ అసెస్​మెంట్​) ఎగ్జామ్స్​ నిర్వహించారు. వీటి ఆధారంగా అంతర్గత మార్కులు వేయాలి. వాటిని పర్యవేక్షణ అధికారులు పరిశీలించాక, ఎస్సెస్సీ బోర్డుకు ఆన్‌లైన్‌లో పంపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడి స్టూడెంట్స్​ వివరాలు ఇప్పటికీ బోర్డుకు చేరలేదు. ఆశ్రమ పాఠశాల జాబితా రాలేదని రాష్ట్రస్థాయి బోర్డు అధికారుల నుంచి జిల్లా విద్యాశాఖకు రెండు రోజుల క్రితం సమాచారం అందింది. దీంతో మాన్యువల్‌ మార్కుల జాబితాను పాఠశాల హెచ్‌ఎం డీఈవో ఆఫీసులో అందజేయగా.. అక్కడి నుంచి బోర్డుకు సమర్పించారు.
గ్రేడింగ్‌లో సమస్యలు ఉండవ్​
ఈ విషయమై హెచ్​ఎం భద్రును ‘సారథి మీడియా’ వివరణ కోరగా.. అంతర్గత మార్కుల వివరాలను గడువులోగా ఆన్‌లైన్‌ చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై డీఈవో సరోజినీదేవి, ఐటీడీఏ డీడీ జహీరుద్దీన్‌ మాట్లాడుతూ ఒక్కోసారి సాఫ్ట్‌వేర్‌ లోపాలతో స్కూళ్లు నమోదుచేసిన వివరాలు కనిపించకపోయే అవకాశం ఉందన్నారు. గ్రేడింగ్‌లో ఏ సమస్యలు ఉండవన్నారు.