Breaking News

టీ20 సిరీస్ ఆడదామా..?

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరిలో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో స్వల్పమార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్​లో జరిగే మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్ ఆడడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సిరీస్ ఆడేందుకు టీమిండియా అంత సుముఖంగా లేదని సమాచారం. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ విండోలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో కేవలం మూడు మ్యాచ్‌ల కోసం ఆసీస్‌కు వెళ్లి మళ్లీ భారత్​కు తిరిగి రావడం.. ఆ తర్వాత టెస్ట్‌, వన్డే సిరీస్‌ కోసం మళ్లీ అక్కడికి వెళ్లడం అంత సురక్షితం కాదని భావిస్తున్నారు. అంటే మూడునెలల వ్యవధిలో రెండుసార్లు ఆసీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీనికితోడు అంతర్జాతీయ ప్రయాణాల నిషేధం, 14 రోజుల క్వారంటైన్‌ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత రిస్క్‌ తీసుకోవడం అవసరమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


వాస్తవానికి టీ20 ప్రపంచకప్ కంటే భారత్​తో సిరీస్​పై సీఏ భారీగా ఆశలు పెట్టుకుంది. ఎట్టిపరిస్థితుల్లోనైనా ఈ పర్యటనను విజయవంతం చేయాలని పట్టుదలగా ఉన్నట్లు సీఏ సీఈవో కెవిన్‌ రాబర్ట్స్‌ కూడా స్పష్టంచేశారు. ఇందులో భాగంగా పర్యటనకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. దీని ప్రకారం అక్టోబర్‌ 11, 14, 17వ తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. ఆ తర్వాత డిసెంబర్‌ 3న మొదలయ్యే నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ జనవరి 7తో పూర్తవుతుంది. 12వ తేదీ నుంచి మూడు వన్డేల సిరీస్‌ జరుగుతుంది. అయితే టీ20 సిరీస్‌, టెస్ట్‌ సిరీస్‌కు మధ్య దాదాపు రెండున్నర నెలల విరామం ఉండడం సమస్యగా మారింది. ఒకవేళ ఈ విరామంలో అంటే అక్టోబర్‌ 18 నుంచి టీ20 ప్రపంచకప్ జరిగితే పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ ఇది వాయిదాపడితే ఐపీఎల్ నిర్వహిస్తామని అంటున్నారు. మామూలుగా అయితే ఆసీస్‌తో టీ20 సిరీస్‌ ముగిశాక ప్రపంచకప్ కోసం టీమిండియా అక్కడే ఉంటుంది. కానీ వరల్డ్​ కప్​ విండోలో ఐపీఎల్‌ జరగడం ఖాయమైతే టీ20 సిరీస్‌ ముగిసిన వెంటనే కోహ్లీసేన స్వదేశానికి వచ్చి తీరాలి. అంటే క్రికెటర్లు భారత్​కు వచ్చిన వెంటనే మళ్లీ క్వారంటైన్‌కు వెళ్లాలి. మళ్లీ టెస్ట్‌ సిరీస్‌ కోసం ఆసీస్‌కు వెళ్లాక మరోసారి క్వారంటైన్‌లో ఉండాలి. దీంతో క్రికెటర్లు, ఇతర సిబ్బంది చాలా ఇబ్బందులు పడాలి. మ్యాచ్‌ ప్రాక్టీస్‌కు తగినంత టైమ్‌ కూడా దొరకదు. మూడు నెలల వ్యవధిలో ఇన్నిసార్లు క్వారంటైన్‌ అంటే కష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.