Breaking News

టీ20 వరల్డ్ కప్ పై నీలినీడలు!

టీ20 వరల్డ్ కప్పై నీలినీడలు

–కరోనా పరిస్థితులే కారణం
–ట్రావెల్ రిస్ర్టిక్షన్స్ పై స్పష్టత రావాలి

న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో కుదేలైన క్రికెట్ కు మరో ఎదురుదెబ్బ తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్ కప్పై నీలినీడలు కమ్ముకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఆస్ర్టేలియాలో అక్టోబర్, నవంబర్లో ఈ టోర్నీ జరగాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ 30 వరకు ఆసీస్ లో ట్రావెట్ బ్యాన్ విధించారు. దీంతో విదేశీ ప్రయాణికులు ఎవరూ అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు.

ఆ తర్వాత కూడా అంక్షలు కొనసాగే చాన్స్ ఉండడంతో టోర్నీ నిర్వహణ సందిగ్ధంలో పడింది. గురువారం జరిగిన ఐసీసీ మీటింగ్ కూడా ఈ టోర్నీపై ఏటూ తేల్చలేకపోయింది. ఈ పరిణామాల దృష్ట్యా అక్టోబర్‌‌లో షెడ్యూల్‌ చేసిన ప్రపంచకప్‌ జరగడం దాదాపు అసాధ్యమైని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై స్పందించిన బోర్డు అధికారి ఒకరు..

ఈ టోర్నీ జరగాలంటే చాలా అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ముందుగా కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడాలని, ఇండియాతో పాటు ప్రపంచం అంతా ట్రావెల్‌ రిస్ట్రిక్షన్స్పై స్పష్టత రావాల్సి ఉందన్నారు. ‘నిజాయితీగా చెప్పాలంటే అక్టోబర్‌‌లో టీ20 జరగడం అసాధ్యమనిపిస్తోంది.

అప్పటికి టోర్నీకి అవసరమైన వారిని ఒక్క చోటుకు చేర్చాలనే ఆలోచనే ఇప్పుడు అమాయకంగా అనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ ప్రయాణాలు ఎంత వరకు భద్రమో ఎవరికీ తెలియదు.

కొందరు జూన్‌లో ప్రయాణాలు మొదలవుతాయని అంటే, ఇంకా సమయం పట్టవచ్చని మరికొందరు చెబుతున్నారు. ఒకసారి ఇంటర్ నేషనల్ ట్రావెలింగ్‌ మొదలైన తర్వాతే.. కరోనా వ్యాప్తి తగ్గిందో లేదో, ట్రావెల్‌పై దాని ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది’ అని అభిప్రాయపడ్డారు.


భద్రత ఎలా?
ఈ మెగాటోర్నీలో పాల్గొనే ఆటగాళ్లు, అధికారుల భద్రత విషయంలో బాధ్యత ఎవరు తీసుకుంటారని బోర్డు అధికారి ప్రశ్నించారు. ఈ టోర్నీకి చాలామంది వస్తారు. మరి, వారి సేఫ్టీకి సంబంధించిన బాధ్యతను తీసుకోడానికి ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా సిద్ధంగా ఉన్నాయా? అన్న ప్రశ్న వస్తోంది. అప్పుడు ప్రభుత్వాలు కూడా ఇందులో ఇన్వాల్వ్‌ అవ్వాల్సి ఉంటుంది. మరి, ఆస్ట్రేలియా గవర్నమెంట్‌ ఆ రిస్క్‌ తీసుకోవాలని అనుకుంటుందా? తీసుకుంటే తమ అంగీకారం ఎన్ని రోజుల్లో తెలుపాలి? టోర్నీ సన్నద్ధత విషయంలో ఇతర బోర్డులకు కూడా సమయం సరిపోతుందా? తమ దేశ జట్లను ఆసీస్‌కు పంపించేందుకు ఇతర దేశాల ప్రభుత్వాలు అంగీకరిస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు రావాలి.

మరో ప్రధాన అంశం ఫ్యాన్స్ సేఫ్టీ. ఇప్పుడున్న అనేక ఆంక్షల మధ్య ప్రేక్షకులు స్టేడియాలకు వస్తారా? లేదంటే సోషల్‌ డిస్టెన్స్‌ పాటించడం కోసం పది సీట్లలో ఒక్క టికెట్‌ నే అందుబాటులో ఉంచుతారా?’ అని బోర్డు అధికారి ప్రశ్నలు సంధించారు.