Breaking News

టీ20 వరల్డ్​ కప్​పై కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్​ను వాయిదా వేస్తారని ఊహాగానాలు వచ్చినా.. అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ఆ దిశగా అడుగులు వేయలేకపోయింది. ప్రస్తుత పరిణామాలను నిశితంగా గమనిస్తున్న గవర్నింగ్ బాడీ తమ నిర్ణయాన్ని వచ్చేనెల 10కు వాయిదా వేసింది. అప్పటివరకు పరిస్థితులపై భాగస్వాములతో చర్చించాలని నిర్ణయించింది. ఆ తర్వాతే మెగాఈవెంట్స్​పై తుదినిర్ణయం తీసుకోనుంది. మూడు రోజుల పాటు జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో సుదీర్ఘమైన చర్చలు జరిగినా తమ షెడ్యూల్స్​కు సంబంధించి ఐసీసీ ఎటూ తేల్చుకోలేకపోయింది. అయితే గవర్నింగ్ బాడీకి సంబంధించిన రహస్య విషయాలు మీడియాకు లీక్ కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన ఐసీసీ.. దీనిపై విచారణకు ఆదేశించింది.

రహస్యంగా ఉండాల్సిన ఈ మెయిల్స్, ఇతర అంశాలు ఎలా లీక్ అవుతున్నాయో కనిపెట్టాలని ఎథిక్స్ ఆఫీసర్​ను ఆదేశించింది. ‘పరిపాలనలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నా.. సమాచారం లీక్‌ కావడంపై బోర్డులో ఎక్కువ మంది సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమకు తెలియకముందే మీడియాకు సమాచారం ఎలా లీక్‌ అవుతుందో తేల్చాలని కోరారు. మా ఎథిక్స్‌ ఆఫీసర్‌ ఈ లీక్‌లపై సమగ్ర విచారణ జరిపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే నిపుణులు కూడా ఇందుకు సహకరిస్తారు. వచ్చే సమావేశంలో దీనికి సంబంధించిన అంశాలను సీఈవో మీకు వెల్లడిస్తారు’ అని ఐసీసీ పేర్కొంది.