అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. పవర్ స్టార్ ఎప్పుడు థియేటర్ లో ప్రత్యక్షమవుతాడా? అని ఆతృత పడుతున్నారు. అయినా పవన్ కల్యాణ్ సినిమా లేట్ అవుతూనే ఉంది. కరోనా కారణంగా దాదాపు రెండున్నర నెలలుగా టాలీవుడ్‌లో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడిందన్న విషయం తెలిసిందేగా. రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతులిచ్చిన ప్రభుత్వం మూవీ షూటింగులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో జూన్ మొదటి వారంలో షూటింగ్ ల కోసం అన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. కానీ పవన్, వేణుశ్రీరామ్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘వకీల్ సాబ్’ సినిమా మాత్రం కాస్త లేటుగా సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారట చిత్రయూనిట్.
ఈ మూవీకి సంబంధించి ఇంకా 30 రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉందట. వైరస్ వ్యాప్తి బాగా అదుపులోకి వచ్చాకనే షూటింగును పెట్టుకుందామని చిత్ర నిర్మాతలకు పవన్ చెప్పారట. అయితే జులై నుంచి ఈ మూవీ పెండింగ్ షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో అంజలి, నివేథా థామస్, అనన్య, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా నటించనుందనే వార్త చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్ గా వస్తోన్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా పూర్తి కాగానే క్రిష్ తో ఓ సినిమా, హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నాడు పవర్ స్టార్.