Breaking News

అర్బన్​ పార్క్​.. సిటీ మార్క్​

  • నర్సాపూర్​ పార్క్​ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్​

సారథి న్యూస్, మెదక్: గెజిబోలు, వాచ్‌‌ టవర్‌‌లు, వాకింగ్‌‌, సైకిల్‌‌ ట్రాక్‌‌లు, ట్రెక్కింగ్ సౌకర్యాలు… ఇవన్నీ ఎక్కడో మెయిన్‌‌ సిటీలో ఉండే పెద్ద పెద్ద పార్కు‌లు, రిసార్ట్స్​లో ఉండే సౌకర్యాలు అనుకుంటున్నారు కదూ! నిజమే కానీ అది ఇదివరకటి మాట. ఇప్పుడు జిల్లాలో సైతం ఇలాంటి పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్‌‌ ఫారెస్ట్‌‌లో అన్ని హంగులతో అర్బన్‌‌ పార్క్‌‌ రెడీ అయింది..
కాలానుగుణంగా ప్రజల జీవనశైలి మారుతోంది. తీరిక సమయాల్లోనే కాక, ఆరోగ్య పరిరక్షణ కోసం ఉదయం, సాయంత్రం వేళలో పార్క్‌‌లో వాకింగ్‌‌, సైక్లింగ్‌‌ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుండగా, యువకుల్లో ట్రెక్కింగ్‌‌ పై ఇంట్రెస్ట్‌‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాల్లోని అటవీప్రాంతాల్లో అర్బన్‌‌ పార్కు‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాజధాని హైదరాబాద్ సిటీకి చేరువలో ఉన్న మెదక్‌‌ జిల్లాలో నాలుగు అర్బన్‌‌ పార్క్‌‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దట్టమైన అటవీ ప్రాంతానికి నెలవై, వీకెండ్స్‌‌, ఇతర సెలవు రోజుల్లో జంటనగరాల నుంచి సందర్శకులు ఎక్కువగా వచ్చే, తరచూ సినిమా షూటింగ్ లు జరిగే నర్సాపూర్‌‌ పట్టణ శివారులోని ఫారెస్ట్‌‌లో అర్బన్‌‌ పార్క్‌‌ ఏర్పాటుకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఫారెస్ట్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. మొత్తం 2,765 హెక్టార్ల విస్తీర్ణంలో అర్బన్ పార్కును డెవలప్ చేయాలని నిర్ణయించారు.


ఆహా.. అనిపించే నిర్మాణాలు
హైదరాబాద్‌‌ –మెదక్‌‌ నేషనల్‌‌ హైవేపై అర్బన్‌‌ పార్క్‌‌లోకి వెళ్లేందుకు వీలుగా రెండు మెయిన్‌‌ గేట్లను ఆకట్టుకునేలా నిర్మించారు. ఏడు కి.మీ. మేర ఫెన్సింగ్‌‌ ఏర్పాటుచేశారు. అర్బన్‌‌ పార్క్‌‌లో ఫారెస్ట్‌‌ అందాలను తిలకించేందుకు వీలుగా 60 ఫీట్ల ఎత్తులో రెండు వాచ్‌‌ టవర్‌‌లను ఎంతో ఆకర్షణీయంగా నిర్మించారు. ఒక చోట ఆకట్టుకునేలా గజిబో ఏర్పాటు చేశారు. అచ్చు కలప మాదిరిగా కనిపించేలా కాంక్రీట్ తో సందర్శకులు కూర్చునేందుకు ఏర్పాట్లుచేశారు. పలుచోట్ల సిమెంట్‌‌ బెంచీలను నిర్మించారు. వాకింగ్‌‌, సైక్లింగ్‌‌కు అనుగుణంగా ఏర్పాట్లుచేశారు. మేడంబండ, కొండాపూర్‌‌ హనుమాన్‌‌ దేవాలయం సమీపంలో నుంచి ఫారెస్టులోకి కాలినడకన వెళ్లేందుకు వీలుగా మట్టిరోడ్లను నిర్మించారు. అర్బన్‌‌ పార్క్‌‌కు వెళ్లే రూట్లో ఉన్న వాగులపై మూడు చోట్ల బ్రిడ్జీలు నిర్మించారు.

వన్యప్రాణులకోసం అక్కడక్కడ పర్య్కులేషన్‌‌ ట్యాంకులు, చెక్‌‌ డ్యాంలను నిర్మించారు. అర్బన్ పార్కు పక్కనే ఉన్న రాయారావు చెరువులో బోటింగ్ సదుపాయాన్ని సైతం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అర్బన్‌‌ పార్కు అంతటా ప్రస్తుతం ఉన్న చెట్లను సంరక్షించడంతో పాటు ఖాళీప్రదేశాల్లో ఆకర్షణీయమైన మొక్కలు నాటి గ్రీనరీ డెవలప్‌‌ చేస్తున్నారు. అలాగే ఔషధ మొక్కలు నాటారు. అర్బన్‌‌పార్క్‌‌ సందర్శకుల వెహికిల్స్‌‌ పార్కింగ్‌‌ చేసేందుకు వీలుగా నేషనల్‌‌ హైవే పక్కనే పార్కింగ్‌‌ ఏరియాను ఏర్పాటు చేస్తున్నారు. ప్రకృతి ప్రేమికులను ఎంతో ఆకట్టుకునేలా, ఆహ్లాదం, ఆనందాన్ని పంచేలా రూపుదిద్దుకున్న నర్సాపూర్‌‌ అర్బన్‌‌ పార్క్‌‌ ను గురువారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు.