సారథి న్యూస్, మెదక్: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. చావులోనూ ఒక్కటిగానే అనంతలోకాలకు వెళ్లిపోయారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం డి.ధర్మారం గ్రామంలో భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా సంచనం రేకెత్తించింది. గ్రామానికి చెందిన విజయ్ కుమార్ రెడ్డి(29), కామారెడ్డి జిల్లా మల్లుపల్లికి చెందిన రుచిత(25) నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. విజయ్ కుమార్ అదే గ్రామంలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రుచిత అమ్మానాన్నలు రూ.ఆరులక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను ఇచ్చారు.
ప్రేమ వివాహం చేసుకున్నారనే కారణంతో అత్తామామ ప్రేమలత, నర్సింహ్మరెడ్డి, ఆడపడుచు రేవతి నిత్యం రుచితను వేధించేవారు. చీటికిమాటికి చీదరింపులకు గురిచేసేవారు. ఈ క్రమంలో రుచిత, రేవతి గురువారం తీవ్రంగా గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన రుచిత పురుగు మందు తాగింది. అప్పుడే ఇంటికి వచ్చిన భర్త విజయ్‌కుమార్ కూడా భార్య పరిస్థితిని చూసి తానూ తాగేశాడు. వారిని హుటాహుటిన సిద్దిపేట మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి రుచిత చనిపోగా, శుక్రవారం విజయ్ కుమార్ మృతిచెందాడు. వారి ఏడాదిన్నర పాప సాన్విత, మూడేళ్ల కుమారుడు యువన్ రెడ్డిని చూసి స్థానికులు కన్నీరుమున్నీరు అయ్యారు. చిన్నారుల ఏడుపును చూసి ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు.