Breaking News

గులాబీ రంగు పెదాల కోసం

ఎదుటి వారిని నోటి మాటతో పలకరిస్తే.. పెదాలపై చిందే చిరునవ్వే ఆ మనిషి మనసును ఆకట్టుకుంటుంది. అలాంటి చిరునవ్వుకు అందాన్ని ఇచ్చేవి పెదాలు. మగువల అందానికి కళ్లు ఎంత ముఖ్యమో.. లేలేత గులాబీ రంగు పెదాలూ అంతే అందం. అలాంటి పెదాలు అందంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. ఆ అమ్మాయి అన్ని విషయాల్లో కాన్ఫిడెంట్​ గా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి.
పెదాలు అందంగా కనిపించాలని చాలామంది రకరకాల లిప్​స్టిక్స్​, లిప్​ గ్లాసులు వాడుతుంటారు. ప్రస్తుతం మార్కెట్ లో కొత్తగా ఆర్గానిక్ లిప్ కేర్ ప్రొడక్ట్​లు కూడా వస్తున్నాయి. ఇవన్నీ పెదవుల అందాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. కానీ ఏవి వాడాలన్నా ముందు పెదాలు ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే వాటికి ఎలాంటి కాస్మెటిక్స్ వాడినా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే రోజూ ఎంత బిజీగా ఉన్నా చిన్నచిన్న చిట్కాలతో ఇంట్లో పెదాలను ఆరోగ్యంగా మార్చుకోవచ్చు ఇలా..
ఎక్స్ ఫోలేషన్ : వంటింట్లోని చక్కెర బెస్ట్ ఎక్స్​ఫిలేటర్​గా పనిచేస్తుంది. ఒక టీ స్పూన్ తెల్లచక్కెర లేదా బ్రౌన్ షుగర్​లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనె వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని పెదాలపై మర్దన చేయాలి. తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పెదాలపై ఉన్న డెడ్ స్కిన్ (మృతకణాలు) తొలగిపోతాయి. రెండు రోజులకోసారి ఇలా చేస్తే, పెదవులు గులాబీ రంగులోకి మారుతాయి. అలాగే చక్కెరను నిమ్మరసంతో కలిసి ఎక్స్​ఫి​లేట్ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
తేనె: పెదాలకు బెస్ట్ మాయిశ్చరైజర్​గా తేనె పనిచేస్తుంది. రోజు విడిచి రోజు ఉదయం లేచిన వెంటనే తేనెను పెదాలపై అప్లై చేసి ఆరనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో పెదాలను శుభ్రంగా చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల పెదాలు మృదువుగా, ఎర్రగా మారతాయి.
సన్ ప్రొటెక్షన్: పెదాల మీద ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. శరీరంలోని చర్మంతో పోల్చితే చాలా పలుచగానూ ఉంటుంది. అందువల్లే ఎండకు వెళ్లినప్పుడు పెదాలు తొందరగా వాడిపోతాయి. అలాగే నల్లగా మారతాయి. దానికోసం ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు పెదాలకు కొద్దిగా సన్​ స్ర్కీన్​ లోషన్ అప్లై చేయాలి. అప్పుడు సూర్యకిరణాలు అంత త్వరగా పెదాలపై ప్రభావం చూపించలేవు.
పెట్రోలియం జెల్లీ: పెదాలు పొడిబారినప్పుడే పగుళ్లు, నల్లమచ్చలు ఏర్పడతాయి. అందుకే ఏ సీజన్​లోనైనా పెదాలకు రెగ్యులర్​ గా పెట్రోలియం జెల్లీ పెట్టుకోవాలి. దీనివల్ల పెదాలు తడితడిగా, గ్లోయింగ్​ గా ఉంటాయి. లిప్​స్టిక్​ పెట్టుకోవడానికి ముందు పెట్రోలియం జెల్లీ పూసుకుంటే, లిప్​స్టిక్​ తాలూకు సైడ్ ఎఫెక్ట్​లు ఉండవు.
నవ్వే వ్యాయామం: శరీరంలోని అన్ని భాగాల ఆరోగ్యానికి వ్యాయామం ఎంత అవరసరమో, పెదాల ఆరోగ్యానికి కూడా అంతే ముఖ్యం. దీనికి సరైన వ్యాయామం నవ్వడమే. నవ్వడం వల్ల ముఖంలోని కండరాలన్నీ కదులుతాయి. దాంతో పెదాలు రిలాక్స్ అవుతాయి. అలా అందమైన, ఆరోగ్యకరమైన లిప్స్ మీ సొంతమవుతాయి.