తెలుగు, తమిళ భాషల్లో చాలా గీతాలకు తన గొంతునిచ్చిన చిన్మయి శ్రీపాద సింగరే కాదు.. హీరోయిన్ సమంతకు డబ్బింగ్ కూడా చెబుతోంది. ఆ మధ్య మీటూ ఉద్యమంలో ప్రసిద్ధ గేయ రచయిత వైరముత్తుకు వ్యతిరేకంగా కేసు కూడా ఫైలు చేసింది. ‘చి.ల.సౌ.’ ఫేమ్ రాహుల్ రవీంద్రను పెళ్లాడి లైఫ్లో సెటిలైపోయింది కూడా.. ఇప్పుడు లాక్ డౌన్ సందర్భంగా పేదవాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చాలామంది సెలబ్రిటీలు తమవంతు సాయాన్ని అందిస్తున్న వారిలో ఒకరిగా నిలిచింది.
ప్రపంచం యావత్తు ఎదుర్కొంటున్న కరోనా విపత్కర పరిస్థితలకు తనదైన రీతిలో స్పందిస్తూ నేను సైతం.. అంటూ పేదలకు ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. అందుకుగాను చిన్మయి అభిమానులు కోరిన పాటలు పాడి దాదాపు రూ.30లక్షల నిధులు సేకరించి నిరాశ్రయులకు సాయాన్ని అందిస్తోంది. ఇంకా లాక్ డౌన్ కొనసాగే వరకు తన ఈ ప్రయత్నం ఆపబోనని చెబుతోంది. అభిమానులు గాత్రమే కాదు ఆమె మనసు కూడా వెన్నలాంటిదేనని అభినందిస్తున్నారు.