Breaking News

‘గాంధీ’ ఉండగా.. ‘యశోద’కు ఎందుకు?

సారథి న్యూస్​, హైదరాబాద్​: అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వస్తే యశోదా ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారని, సీఎంకు కంటినొప్పి వచ్చినా, పంటినొప్పి వచ్చినా ఢిల్లీ పోతారని, గాంధీ ఆస్పత్రి డాక్టర్లు అందించే వైద్యంపై వారికి నమ్మకం లేదా..? అని మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ఇది డాక్టర్లను అవమానించడం కాదా? అని ఆయన అన్నారు. కరోనా మహమ్మారికి బలైన సహచర జర్నలిస్టు మనోజ్ కుమార్ కు మృతికి నివాళిగా శనివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(ఐజేయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్​లో జర్నలిస్టులు చేపట్టిన ఒకరోజు ఉపవాస దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. జర్నలిస్టులు విధిలేని పరిస్థితుల్లో దీక్షలు చేస్తున్నారని, ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. ప్రతి కరోనా పేషెంట్​కు రూ.3.5 లక్షలు ఖర్చుపెడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం, మనోజ్ కు ఎంత ఖర్చుపెట్టిందో చెప్పాలన్నారు.

రాష్ట్రంలో పాలన నచ్చితే నజరానా, నచ్చకపోతే జురుమానా అనే తీరుగా నడుస్తుందన్నారు. సంపన్నులు, దాతలు నుంచి రూ.3వేల నుంచి 4వేల కోట్లు విరాళాలుగా వచ్చాయని, జీతభత్యాల్లో కోతలు రూ.1500 నుంచి రూ.1800 కోట్ల అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. రూ.800 కోట్లు కరెంట్​ బిల్లుల ద్వారా ఆదాయం వచ్చిందన్నారు. లిక్కర్​ ద్వారా రూ.2500 కోట్ల వచ్చిందన్నారు. రూ.10 నుంచి 15వేల కోట్ల ఆదాయం పెరిగిందన్నారు. అవన్ని ఎక్కడికి పోయావని ప్రశ్నించారు. అడ్వకేట్లకు మాదిరిగానే రూ.25కోట్ల నిధి ఇచ్చినట్టుగానే జర్నలిస్టులకు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో ఇప్పటివరకు 50వేల టెస్టులు కూడా చేయలేదన్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో తెలుస్తుందన్నారు. వచ్చేవారం ఈటెలను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నారని, అందుకే సీఎం కేసీఆర్​ ఈ పరిస్థితిని తీసుకొచ్చారని అన్నారు. అనంతరం జర్నలిస్టుల సహాయనిధికి రూ.రెండు లక్షల చెక్ ను అందజేశారు.
మనోజ్​ కుటుంబాన్ని ఆదుకోవాలి
టి.జర్నలిస్టుల ఫోరమ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్​ మాట్లాడుతూ.. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. తక్షణమే రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించడంతో పాటు మృతుడి భార్యకు ఉద్యోగం, డబుల్ బెడ్​ రూమ్​ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రూ.50లక్షల బీమా కల్పించాలన్నారు. మూడు నెలలపాటు ప్రతి జర్నలిస్టుకు రూ.10వేల ఆర్థికసాయం చేసి, వారిలో భరోసా కల్పించాలన్నారు. మనోజ్ కుమార్ మరణం గాంధీ ఆస్పత్రిలోని దుస్థితికి అద్దం పట్టిందన్నారు. కార్యక్రమంలో టి.జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, సెక్రటరీలు కోడికంటి శ్రీనివాస్, పాలకూరి రాజు, విరాహత్​అలీ పాల్గొన్నారు.