Breaking News

గల్లీ షాపులకే గిరాకీ

గల్లీ షాపులకే గిరాకీ
  • సూపర్ ​మార్కెట్లకు జనం అంతంత మాత్రమే

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్​డౌన్​ అమలవుతున్న విషయం తెలిసిందే. మారుతున్న కాలంలో సామాజిక జీవనంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నగర , పట్టణ ప్రాంతాల్లో ఈ మార్పులు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంత కాలం సూపర్ మార్కెట్లలో కొనేందుకు ఆసక్తి చూపించిన ప్రజలు ఇప్పుడు తమ వీధి, తమ ఇళ్లకు సమీపంలో ఉన్న చిన్నచిన్న కిరాణ దుక్నాల్లో కొంటున్నారు. ఇంతకాలం అరకొరగా నడిచిన ఈ దుకాణాలు ఇప్పుడు గిరాకీ పెరిగి గల్లా పెట్టెలు కళకళలాడుతున్నాయి.

సూపర్ ​మార్కెట్లు బేజార్​

కరోనా పాజిటివ్​ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు. పరిచయం లేని వ్యక్తులను కలిసేందుకు విముఖత చూపుతున్నారు. ఏడాదంతా అందుబాటులో ఉండే సూపర్​మార్కెట్లలో ఆకర్షణీయమైన డిస్​ప్లేలలో ఉండే వస్తువులు కొనేందుకు మొగ్గు చూపేవాళ్లు. ముఖ్యంగా ఉప్పుపప్పు, సబ్బు బిళ్లల నుంచి బట్టలు, ఎలక్ట్రానిక్స్​ ఇలా అన్నీ ఒకే దగ్గర లభించే పెద్ద పెద్ద రిటైల్​ చైన్​ ల వైపు వెళ్లేవారు. ఈ బడా మాల్స్​, సూపర్ ​మార్కెట్లు కస్టమర్లతో కిటకిటలాడేవి. ముఖ్యంగా బిల్లింగ్​ డెస్క్​ వద్ద పొడవైన క్యూలైన్లు నిత్యకృత్యం. కరోనా అంటుకోవడంతో సీన్​ మొత్తం మారిపోయింది.లాక్​డౌన్​ ప్రకటన వెలువడిన తొలి రెండు రోజులు మార్టులు, ఫ్రెష్​లు, బజార్లలో రద్దీ ఎక్కువగా కనిపింంచింది. ఆ తర్వాత ఈ రద్దీ క్రమంగా తగ్గుముఖం పట్టింది.

జాగ్రత్తలు

లాక్​డౌన్​ నేపథ్యంలో తమ నివాస ప్రాంతాల నుంచి గరిష్టంగా మూడు కిలోమీటర్ల పరిధి దాటి వెళ్లేందుకు పోలీసు శాఖ అనుమతి ఇవ్వడం లేదు. ఎవరైనా హద్దులు మీరి వెళ్తే లాఠీ దెబ్బల రుచినో, జరిమానో, వాహనాలను జప్తు చేయడమో చేస్తున్నారు. దీనికితోడు కరోనావ్యాప్తికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో సోషల్​ డిస్టెన్సింగ్​పై ప్రజల్లో  అవగాహన పెరిగింది. మాల్స్​ వద్ద అమలుచేస్తున్న సోషల్​ డిస్టెన్సింగ్​తో పొడవైన క్యూ లైన్లు తప్పనిసరిగా మారాయి. ఒకటి రెండు వస్తువులు కొనాలంటే గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కువ సమయం బయట ఉండటానికి ఎవరూ ఇష్టం చూపడం లేదు. పైగా మాల్స్ దగ్గర వచ్చే వారిలో నూటికి తొంభైశాతం ఒకరికొకరు పరిచయం ఉండరు. దీంతో ఎవరు ఏమిటో తెలియకుండా అనవసరంగా ఎందుకు రిస్క్​ అనే భావన ప్రజల్లో కలుగుతుంది.

గల్లీ కొట్టు అయితే..

ఇంటి పక్కనో వీధి చివరో ఉండే గల్లీ కొట్టు అందరికీ సుపరిచతమే. ఇంతకాలం ఇంట్లో ఏదో ఒక వస్తువు అయిపోతే అప్పటికప్పుడు అవసరార్థం ఈ గల్లీ కొట్టుపై ఆధారపడేవారు. ఇప్పుడు బయట పరిస్థితులు,లాక్ డౌన్​ నేపథ్యంలో గల్లీ కొట్టే పెద్ద దిక్కకైంది. ఇంతకాలం ఒకటిరెండు వస్తువులు కొనడం, టైంపాస్​ విండో షాపింగ్​ కోసం మాల్స్​ వెళ్లే వారు ఇప్పుడు గ​ల్లీ దుక్నాలనే ఆశ్రయిస్తున్నారు. ఇంటికి అ వసరమైన అన్నీ వస్తువులు ఇక్కడే కొంటున్నారు. ఈ దుకాణాలకు వచ్చే వారు నూటికి 90శాతం తెలిసిన వారే ఉండడంతో ఇక్కడ కొనుగోలు చేయడం వల్ల ఏ ప్రమాదం ఉండదనే నమ్మకం ప్రజల్లో కలిగింది. దీనికి తోడు 21 రోజుల పాటు లాక్​డవున్​ ఉండటంతో నెలవారీ సామన్లలో ఒకరి రెండు వస్తువుల అయిపోతే వెంటనే ఈ షాపులను ఆశ్రయిస్తున్నారు. దీంతో గల్లీ షాపులు బిజీగా మారాయి. లాక్​డవులు మొదలైన మొదటి వారం ఈ దుకాణాలకు పెద్దగా గిరాకీ లేకపోయినా ఆ తర్వాత తమ వ్యాపారం పుంజుకుందని, స్థానికులంతా తమ వద్దనే కొనుగోలు చేస్తున్నారని, గల్లీ కొట్టు నిర్వాహకులు చెబుతున్నారు. కొత్తగూడెం, మంచిర్యాల, వనపర్తి, సూర్యాపేట, సిద్దిపేట లాంటి మున్సిపాలిల నుంచి మొదలుకుని కరీంనగర్​, వరంగల్​లతో పాటు  హైదరాబాద్ వంటి కాస్మోపాలిటన్​ సిటీ​ వరకు ప్రతి అర్బన్​ ఏరియాల్లో ఇదే తరహా పరిస్థితి కనిపిస్తోంది.  లాక్ డౌన్​ కారణంగా తమ వ్యాపారాలు నష్టాల పాలవుతాయని భయపడ్డామని, అందుకు విరుద్ధంగా గతం కంటే అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయని చెబుతున్నారు. కోడిగుడ్లు, పాలకు గిరాకీ ఎక్కువగా ఉంటుందన్నారు. షాపుల్లో ఇప్పటికే కొన్ని వస్తువులు పూర్తిగా అయిపోవడానికి వచ్చాయని, చెప్పారు. లాక్​డవున్​ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంటే  తమ స్లపై చైన్ తెగిపోకుండా నిత్యావసర వస్తువులు తెచ్చే లారీలు, హామాలీలు, ఆటోలకు లాక్ డౌన్​ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. దీని వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పుతాయని అంటున్నారు.