న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు.. ఐసీసీ ప్రెసిడెంట్ కావాలని కోరుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కూడా చేరాడు. దాదా అంతర్జాతీయ బాడీ పగ్గాలు చేపడితే చాలామంది క్రికెటర్లకు న్యాయం జరుగుతుందన్నాడు. అత్యున్నత స్థానాన్ని చేపట్టేందుకు గంగూలీకి అన్ని అర్హతలు ఉన్నాయన్నాడు. తనపై పాక్ బోర్డు విధించిన జీవితకాల నిషేధాన్ని కూడా ఐసీసీలో అప్పీల్ చేస్తానన్నాడు. ‘నా విషయంలో దాదా తప్ప మరెవరూ న్యాయం చేయలేరు. ఈ విషయంలో అందరూ సహకరిస్తారని కూడా నమ్ముతున్నా. దాదా అద్భుతమైన క్రికెటర్. మనవైపు నుంచి చెప్పే ప్రతి చిన్న విషయాన్ని కూడా బాగా అర్థం చేసుకుంటారు. నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో ఇది అత్యంత ప్రాధాన్యమైంది. మన వాదన అవతలి వైపు వినకపోతే మనం ఎన్ని చేసినా వృథానే. అందుకే ఐసీసీ అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నా’ అని కనేరియా పేర్కొన్నాడు.
2012లో ఇంగ్లిష్ కౌంటీ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాడనే ఆరోపణలతో కనేరియాపై జీవితకాల నిషేధం విధించారు. ప్రస్తుతం భారత క్రికెట్ సరైనదిశలో వెళ్తుందని కనేరియా తెలిపాడు. గంగూలీ చొరవతో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘ఒకప్పుడు గంగూలీ నాయకత్వంలో టీమిండియా చాలా గొప్ప విజయాలు సాధించింది. ధోనీ, విరాట్ దానిని కొనసాగిస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా చాలా గొప్ప పనులు చేస్తున్నారు. ఒకవేళ ఐసీసీ పగ్గాలు చేపట్టినా.. ప్రపంచ క్రికెట్ చాలా దూరం ప్రయాణిస్తుంది’ అని కనేరియా వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో పాక్ బోర్డు మద్దతు ఇవ్వకపోయినా.. మిగతా దేశాలన్నీ దాదా వైపే ఉంటాయన్నాడు.