Breaking News

క్రికెటర్ల శిక్షణకు ఎన్సీఏ కసరత్తు

న్యూఢిల్లీ: ఓవైపు కరోనా భయపెడుతున్నా.. మరోవైపు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, శ్రీలంక క్రికెటర్లు ట్రైనింగ్​ మొదలుపెట్టారు. కానీ టీమిండియా మాత్రం ఈ విషయంలో ఇంకా వెనకడుగు వేస్తూనే ఉంది. మరి భారత క్రికెటర్లు ట్రైనింగ్​ ఎప్పుడు మొదలుపెడతారన్న దానిపై బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ కొద్దిగా స్పష్టత ఇచ్చాడు. క్రికెటర్ల ప్రాక్టీస్​కు సంబంధించి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), క్రికెట్ ఆపరేషన్స్ టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నాడు. ‘ఇప్పుడు మా ముందున్న లక్ష్యం.. క్రికెట్​ను మొదలుపెట్టడం. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.

ఆటగాళ్ల ప్రాక్టీస్​పై ఇప్పటికే రెండు టీమ్​లు కసరత్తులు చేస్తోంది. లాక్​ డౌన్​ సడలింపుల విషయంలో చాలా రాష్ట్రాల్లో చాలా తేడాలు ఉన్నాయి. వీటన్నింటిని మేం పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్​ను రూపొందించాలి. అందుకే నిర్ధిష్ట సమయాన్ని చెప్పలేకపోతున్నాం. వీలైనంత త్వరగా ట్రైనింగ్​ మొదలుపెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తాం’ అని ధుమాల్ పేర్కొన్నాడు. జాతీయ క్యాంప్ కోసం తాము ఏదో ఓ ప్రదేశాన్ని ఎంచుకోవాల్సి ఉందన్నాడు.