ముంబై: లాక్ డౌన్ కారణంగా క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమైనా.. ఫిట్నెస్ విషయంలో మాత్రం ఎవరూ తగ్గడం లేదు. తమకు అనువైన ప్రదేశంలోనే, తమకు నచ్చిన రీతిలో ఎక్సర్సైజ్లు చేస్తున్నారు. ప్రపంచ క్రికెటర్లలో బెస్ట్ ఫిజిక్, ఫిట్నెస్ ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కసరత్తులు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడనేది అందరికీ తెలిసిన విషయమే. అత్యుత్తమ దేహాదారుఢ్యం ఆయన సొంతం.
దానిని కాపాడుకునేందుకు చాలా శ్రమిస్తాడు కూడా. అతన్ని చూసి చాలా మంది సహచరులు కూడా ఫిట్నెస్ మంత్రను క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. తాజాగా విరాట్.. ‘180 ల్యాండింగ్స్’ అనే ఎక్సర్సైజ్ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. చాలా కష్టమైన ఈ ఎక్సర్సైజ్ తొలిసారి చేశానని కోహ్లీ వెల్లడించాడు. ‘మై ఫస్ట్ షాట్ ఎట్ 180 ల్యాండింగ్స్. టాప్ ఎక్స్‌ర్‌సైజ్’ అంటూ కామెంట్‌ను జతచేశాడు. 180 డిగ్రీల కోణంలో చేసే ఈ ఎక్సర్సైజ్ చాలాకష్టంగా ఉంటుంది.