Breaking News

కోవిడ్‌తో కేంద్ర‌మంత్రి మృతి

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ స‌హాయ మంత్రి సురేశ్ అంగ‌డి క‌రోనా సోకి మ‌ర‌ణించారు. ల‌క్ష‌ణాలేమీ లేకున్నా (అసింప్ట‌మేటిక్‌) క‌రోనాతో రెండువారాల క్రితం ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరిన ఆయ‌న.. బుధ‌వారం తుదిశ్వాస విడిచారు. చికిత్స తీసుకుంటున్న స‌మ‌యంలోనే ఆయ‌నకు శ్వాస‌కోస ఇబ్బందులు త‌లెత్త‌డంతో ఆరోగ్యం క్షీణించింది. కోవిడ్ వ‌ల్ల మ‌ర‌ణించిన తొలి కేంద్ర మంత్రి ఆయ‌నే. క‌ర్నాట‌కకు చెందిన సురేశ్ అంగ‌డి.. బెల్గావి పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు.

2004 నుంచి వ‌రుస‌గా నాలుగుసార్లు అక్క‌డి నుంచే గెలిచారు. లింగాయ‌త్‌ వ‌ర్గానికి చెందిన సురేశ్‌కు బెల్గావిలో విద్యా సంస్థ‌లున్నాయి. ఆయ‌న‌కు భార్య, ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. సురేశ్ ఆక‌స్మిక మ‌ర‌ణంపై రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని మోడీ, కేంద్రమంత్రులు, సీఎంలు సంతాపం వ్య‌క్తం చేశారు. కాగా కోవిడ్ వ‌ల్ల చ‌నిపోయిన‌వారిలో సురేశ్ నాలుగో వ్య‌క్తి. క‌ర్నాట‌క నుంచి కొద్దిరోజుల క్రిత‌మే అశోక్ గ‌స్తీ క‌రోనా వైర‌స్ వ‌చ్చి మ‌ర‌ణించిన విష‌యం విదిత‌మే.