Breaking News

కృష్ణానీటిని తరలిస్తే ఖమ్మం ఎడారే

సారథి న్యూస్​, ఖమ్మం: కృష్ణానది నీటిని అక్రమంగా తరలించుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోనం. 203 అమలైతే.. దక్షిణ తెలంగాణతో పాటు ఖమ్మం జిల్లాకు సాగునీరు అందక ఎడారిగా మారడం ఖాయమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సంగమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి శుక్రవారం ఆయన ఖమ్మం జిల్లా గోళ్లపాడులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండితేనే నాగార్జునసాగర్ కు నీళ్లు వస్తాయన్నారు. ఏపీ ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ ద్వారా రోజుకు మూడు టీఎంసీల చొప్పున తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. శ్రీశైలంకు నీరు రాని పక్షంలో సాగర్ కు, ఇక్కడున్న పాలేరుకు నీళ్లు రావడం అసాధ్యమని వివరించారు. కార్యక్రమంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎండీ జావేద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, వెంకట్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం పాల్గొన్నారు.