సారథి న్యూస్, నంద్యాల(కర్నూలు): కృష్ణానది జలాల్లో రాయలసీమకు తీవ్రఅన్యాయం జరుగుతోందని రాయలసీమ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం స్థానిక నంద్యాల పట్టణంలోని రామకృష్ణ విద్యాలయంలో జేఏసీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. జేఏసీ చైర్మన్ కోనేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. తుంగభద్ర, కృష్ణానది జలాల్లో ఇంతవరకు పూర్తిస్థాయిలో నీటి కేటాయింపులు జరగలేదన్నారు. నీటి కేటాయింపులు ఉన్న గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులను తక్షణమే పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోనం.203 పేరుతో రాయలసీమను మరోసారి మోసం చేస్తే సహించబోమన్నారు.
రాయలసీమకు కేటాయించిన నీటిని వినియోగించుకోవడానికి ఏకైక మార్గం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణమని, ఎన్నికల ముందు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నేడు నవ్యాంధ్రప్రదేశ్ లో నీళ్లు, నిధులు, నియామకాలు తదితర అంశాలలో అన్యాయం జరుగుతుందని, న్యాయం చేయకపోతే ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఉద్యమం తప్పదని హెచ్చరించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుమల్ల శ్రీధర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పల్లపు శంకర్, ఆదినారాయణ, చంద్రశేఖర్, ఎం.రవి, భాస్కర్ నాయుడు, సురేష్ యాదవ్ పాల్గొన్నారు.