సారథి న్యూస్, హుస్నాబాద్: సీఎం కేసీఆర్ కు గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ కట్టపై కుర్చీవేశామని, కూర్చొని ప్రాజెక్టును పూర్తిచేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ హితవు పలికారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. మిడ్ మానేరు నుంచి గౌరవెల్లి ప్రాజెక్టులోకి రెండు చిన్న చిన్న లింకులను కలిపితే 12 కి.మీ. సొరంగ మార్గం ద్వారా ప్రాజెక్టులోకి నీళ్లు వస్తాయన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం గౌరవెల్లి, గండిపల్లి భూ నిర్వాసితులకు సకాలంలో పరిహారం ఇస్తే కోర్టు కేసులను కొట్టివేస్తామన్నారు.
రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన గౌరవెల్లి, గండిపల్లి రిజర్వాయర్ల పనులు పూర్తికాకపోవడం దురదృష్టకరమన్నారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో అంతర్భాగమని గుర్తుపెట్టుకోవాలన్నారు. సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, డీసీసీ అధికార ప్రతినిధి లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య హుస్నాబాద్, అక్కన్నపేట మండల్ ప్రెసిడెంట్ ఐలయ్య, శ్రీనివాస్ జిల్లా కార్యదర్శులు యాదవరెడ్డి పాల్గొన్నారు.