Breaking News

కిడ్నీ సమస్యలు..పరిష్కార మార్గాలివే

కిడ్నీ సమస్యలు..పరిష్కార మార్గాలివే

అతి ముఖ్యమైన అవయవం

మూత్రపిండాలు… కిడ్నీలు.. ఏ పేరుతో పిలిచిన శరీరంలో జీవక్రియలన్నింటికీ అతి ముఖ్యమైన అవయవం. శరీరంలో నిరంతరం రక్తాన్ని వడబోయడమే వీటిపని. ఈ మూత్రపిండాల పనితీరు మందగిస్తే ఆ వ్యక్తి రకరకాల ఆరోగ్య సమస్యలకు గురై, ఇక చావుకు చేరువకాక తప్పదు. గత కొన్ని దశాబ్దాలుగా కిడ్నీల వ్యాధులు తీవ్రంగా మారాయి.

ఈ వ్యాధుల్ని ముందుగా గుర్తించలేకపోవడం, గుర్తించిన తర్వాత వైద్యం అందుబాటులో లేకపోవడం, దూర ప్రాంతాల్లో ఖరీదైన వైద్యాన్ని చేయుంచుకోలేక ఎంతోమంది జీవితాల్లో చీకట్లు అలముకుంటున్నాయి. కిడ్నీ వ్యాధికి గురైతే ఇక చావే శరణ్యమనే భావన జనంలో బలపడిపోయింది. ‘మార్చి 14న ప్రపంచ కిడ్నీ దినం’ సందర్భంగా కిడ్నీ వ్యాధి నివారణ, జాగ్రత్తలపై స్పెషల్‌‌ స్టోరీ..

శరీరంలో తరచూ యూరియా, క్రియాటిన్‌ లాంటి చాలా రకాల వ్యర్థాలు, విష పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. వీటిని శరీరం నుంచి మల, మూత్ర విసర్జనతో బయటకి పంపించి, మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్రను పోషిస్తాయి. వీటితో పాటుగా నీరు, ఆమ్లాలు, లవణాల(సోడియం, పొటాషియం) ను సాధారణ స్థాయిలో ఉంచుతాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఎముక మూలుగ నుంచి రక్తం (హిమోగ్లోబిన్‌) ని ఉత్పత్తి చేయడంలో ఎరిత్రోపోయిటిన్‌అనే పదార్థం చాలా ముఖ్యమైనది.

ఈ ఎరిత్రోపోయిటిన్‌శరీరంలో ప్రధానంగా కిడ్నీ నుంచే ఉత్పత్తి అవుతుంది. క్యాల్షియం, ఫాస్పరస్‌, విటమిన్‌డి స్థాయిలను మూత్రపిండాలు నియంత్రణలో ఉంచుతూ ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పాటు అందిస్తాయి. అయితే మూత్రపిండాల పనితీరు మందగించినా, పూర్తిగా నిలిచిపోయినా రకరకాల ఆరోగ్యసమస్యల తప్పవు. దీనినే కిడ్నీ ఫెయిల్యూర్‌ అంటారు.

కిడ్నీలు ఫెయిలైతే

మూత్రపిండాలు పనితీరులో విఫలమైనప్పుడు రక్తంలో యూరియా పెరుగుతుంది. ఈ యూరియా లాలాజలంలోని అమ్మోనియాను విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా చెడు శ్వాసకు కారణమవుతుంది. దీన్నే అమ్మోనియా బ్రీత్‌ అని పిలుస్తారు. ఈ బ్రీత్‌మెటాలిక్‌టేస్ట్‌తో ఉంటుంది ఈ వ్యాధి వల్ల ఏర్పడిన రక్తంలోని వ్యర్థపదార్థాలు వ్యాధిగ్రస్తుల్లో వికారం, వాంతులు రావడానికి కారణమవుతాయి. ముఖ్యంగా కిడ్నీ వ్యాధుల వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుంది. రక్తహీనత కిడ్నీ వ్యాధులకు ఒక సాధారణ సైడ్‌ఎఫెక్ట్‌. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. మూత్రపిండాలు విఫలం చెందినప్పుడు వెన్ను పక్కల్లో నొప్పి వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు లోయర్‌బ్యాక్‌పెయిన్‌నుంచి గజ్జ దిగువల భాగం వరకూ ఒక తీవ్రమైన తిమ్మిరితో కూడిన నొప్పి కలుగుతుంది

లక్షణాలివే..

* మూత్రపిండాల పని తీరులో తేడా వచ్చిందని గుర్తించడానికి కొన్ని ముందస్తు సూచనలున్నాయి. అవి.. ఆకలి మందగించడం, వాంతులు అవుతున్నట్టు అనిపించడం, మూత్రం తగ్గిపోవడం.

*రాత్రి సమయంలో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం. మూత్రం దట్టమైన రంగులో ఉండడం. మూత్రవిసర్జన సమయంలో అసౌకర్యం, లేదా కష్టంగా అనిపించడం.

*యూరినరీ ట్రాక్‌ ఇన్ఫెక్షన్లు కిడ్నీలకు వ్యాప్తిచెందితే జ్వరం, బ్యాక్‌పెయిన్‌వంటి సమస్యలు వస్తాయి. రక్తపోటు ఎంతకూ నియంత్రణలో ఉండదు. ఎముకలు, కండరాల నొప్పులు కలుగుతుంటాయి. తరచూ రక్తము తగ్గిపోతూ నీరసం, ఆయాసం లాంటివి చుట్టుముడతాయి.

వ్యాధి తీవ్రమైతే..

కిడ్నీ వ్యాధి తీవ్రమవుతున్న దశలో బహిర్గతమయ్యే లక్షణాలు ఇలా ఉంటాయి.

* భోజనం రుచించదు, ఆహారమంటే ఇష్టం ఉండదు. వాంతులు, వికారం వస్తుంటాయి.

* నీరసంగా ఉండి, బరువు తగ్గిపోతుంటారు.

*కొద్దిగా పనిచేయగానే అలసిపోతుంటారు. ఆయాసం వస్తుంది.

* రక్తం లేక శరీరం పాలిపోవడము (ఎనీమియా). కిడ్నీలో తయారయ్యే ఎర్రిత్రోపోయెటిన్‌ అనే హార్మోన్‌ తక్కువ కావడంతో శరీరంలో రక్తం తక్కువగా తయారవుతుంది.

* శరీరంపై దురద వస్తుంటుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది.

* నిద్ర పోయే రీతిలో మార్పులు ఉంటాయి. ఎన్ని మందులు వాడినా బీపీ వంటివి అదుపులోకి రావు.

* మహిళల్లో రుతుక్రమం సరిగా ఉండదు. పురుషులు నపుంసకత్వానికి లోనవుతారు.

* కిడ్నీ ఫెయిల్యూర్‌వల్ల సంభవించే సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. సరైన చికిత్స అందకపోతే ఆయాసం అధికమవుతుంది. రక్తం వాంతులు చేసుకోవచ్చు.

* రోగికి నిద్ర సరిగా ఉండదు. శరీరం బాధాకరంగా ఉంటుంది. తరచూ స్పృహ తప్పిపోతుంటారు.

* రక్తంలో పొటాషియం ఎక్కువై, దాని ప్రభావం గుండెపై పడి అకస్మాత్తుగా ఆగిపోతుంటుంది.

కారణాలు

*మూత్ర పిండాల పనితీరు దెబ్బతినడానికి ముఖ్యమైన కారణం షుగర్‌, బీపీ చాలాకాలం నియంత్రణలో లేకపోవడం. షుగర్‌, బీపీ వచ్చిన తొలి దశలో సాధారణ స్ధాయిలో ఉంచుకోవాలి. అలా చేయలేకపోతే తర్వాత బీపీ, షుగర్‌‌ను ఎంత నియంత్రించుకున్నప్పటికీ, కిడ్నీ సమస్యలను నియంత్రించడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. ఈ సమస్యలు రకరకాల పరిణామాలకు దారితీస్తాయి.

*మూత్రంలో ప్రోటీన్‌ అధిక మోతాదులో లీకవడం. కిడ్నీలో రాళ్లు ఏర్పడడం, తరచుగా కిడ్నీ ఇన్ఫెక్షన్స్‌ రావడం వంటివి వాటిలో కొన్ని, నొప్పుల మాత్రలు అధిక మోతాదులో ఎక్కువ కాలం వాడడం కిడ్నీలకు ప్రమాదమే. వీటితో పాటు మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలు, స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం, తగినంత నీరు తీసుకోకపోవడం, మూత్రాన్ని తరచుగా గంటల తరబడి ఆపుకోవడం, కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉండడం వంటి అంశాలూ ఈ వ్యాధులకు కారణమవుతుంటాయి.

డయాలసిస్‌ ఎంతకాలం

కిడ్నీ ఫెయిల్యూర్‌గా నిర్ధారణ జరిగిన కొంతమంది మాత్రమే డయాలసిస్‌జీవితాంతం చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మందిలో కొన్ని రోజుల తర్వాత డయాలసిస్‌ఆపివేసి మందులు ఇస్తారు. కానీ ఎక్యూట్‌కిడ్నీ ఫెయిల్యూర్‌కు చికిత్స జరిగిన తర్వాత కిడ్నీ పనితనం సాధారణ స్థితికి చేరుకుని మందులు అవసరమైనప్పటికీ కనీసం ఆరు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి తప్పని సరిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వారిలో 25 నుంచి 30 శాతం మందిలో మళ్లీ కిడ్నీ సమస్య తలెత్తే అవకాశం ఉంది. నిర్లక్ష్యం చేస్తే ఇది క్రానిక్‌కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది.

చికిత్స విధానం

క్రానిక్‌కిడ్నీ ఫెయిల్యూర్‌(సికెడి) రోగులకు మూడు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. 1.హీమో డయాలసిస్‌(బ్లడ్‌డయాలసిస్‌), 2.వాటర్‌డయాలసిస్‌(పెరిటోనియాల్‌డయాలసిస్‌), 3.కిడ్నీ మార్పిడి వంటివాటిని చేస్తారు.

కిడ్నీ మార్పిడి

కిడ్నీ మార్పిడి రెండు రకాలుగా ఉంటుంది. కుటుంబ సభ్యులలో ఎవరి కిడ్నీ అయినా మ్యాచ్‌అవుతున్నట్లయితే ఆ దాత నుంచి కిడ్నీని అమర్చవచ్చు. అలాకాని పక్షంలో చనిపోయిన వారి కిడ్నీలు కూడా అమర్చుకోవచ్చు. చనిపోయిన వారి కిడ్నీలు రోగికి అమర్చడానికి రాష్ట్రంలో జీవన్‌దాన్‌అనే ప్రత్యేక పథకం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి, ఇతరుల నుంచి తీసుకొనే ముందు దాతకి, రోగికి చాలా రకాల పరీక్షలు చేస్తారు. దాత నుంచి ఒక కిడ్నీ తీసేస్తే అతనికి ఉన్న ఒక కిడ్నీతో ఆరోగ్యంగా ఉండగలడని తేలితేనే రోగికి అమరుస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో దాత ఆరోగ్యానికే తొలిప్రాధాన్యం ఇస్తారు. ఇలా అత్యంత జాగ్రత్తగా పరిశీలించి దాతను ఎంపికచేస్తారు. అందువల్ల దాతకు సమస్యలు వచ్చే సందర్భాలు లేవు. ఇది పూర్తి సురక్షితమైంది.

రెండు రకాలుగా సమస్యలు

1.ఎక్యూట్‌కిడ్నీ ఫెయిల్యూర్‌

ఎక్యూట్‌కిడ్నీ ఫెయిల్యూర్‌అంటే మామూలుగా పనిచేస్తున్న రెండు కిడ్నీలకు విభిన్న వ్యాధుల కారణంగా నష్టం కలగడం. ఈ సమయంలో వాటి పనితీరు మందగిస్తుంది. ఈ వ్యాధికి వెంటనే చికిత్స చేస్తే తక్కువ వ్యవధిలో కిడ్నీ సంపూర్ణంగా తిరిగి పనిచేస్తుంది. తర్వాత రోగికి మందులు వేసుకునే అవసరంకానీ, ఆహార నియమాలు పాటించవలసిన అవసరం కానీ లేదు. ఎక్యూట్‌కిడ్నీ ఫెయిల్యూర్‌రోగులకు మందుల ద్వారా, ఆహార నియమాల ద్వారా చికిత్స అందించవచ్చు. వీరిలోనూ కొంతమందికి కొన్నిరోజుల వరకూ డయాలసిస్‌చేయాల్సి ఉంటుంది.

2.క్రానిక్‌కిడ్నీ ఫెయిల్యూర్‌

క్రానిక్‌కిడ్నీ ఫెయిల్యూర్‌అంటే వ్యాధి తీవ్రమైన స్థితి. చాలా రకాల రోగాల వల్ల కిడ్నీ పనిచేసే శక్తి క్రమేపీ కొద్ది నెలలుగా కానీ కొన్ని ఏళ్లుగా కానీ తగ్గుతూ ఉంటుంది. అలా రెండు కిడ్నీలూ మెల్లమెల్లగా పనిచేయడం పూర్తిగా నిలిచిపోతుంది. ఈ వ్యాధిని ప్రస్తుతం ఉన్న చికిత్స విధానాల్లో పూర్తిగా నయం చేసే మందులు ఏమీ లేవు. క్రానిక్‌కిడ్నీ ఫెయిల్యూర్‌ రోగులకు మందుల ద్వారా ఆహార నియమాలు, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడం ద్వారా చికిత్స చేయొచ్చు. మొదట్లో బలహీనంగా ఉన్న కిడ్నీల పనితీరు పెరిగేలా చూడడం తప్పనిసరి. వీరికి కిడ్నీ ఫెయిల్యూర్‌లక్షణాలను పరిశీలనలో ఉంచుకుని, చికిత్స చేయాలి. అయితే ఇది సంపూర్ణ చికిత్స కాదు. మందులతో చికిత్స చేస్తే కిడ్నీ ఎక్కువ పాడైపోవడడంతో సరైన చికిత్స చేస్తున్న రోగ లక్షణాలు పెరుగుతుంటాయి. రక్త పరీక్షల్లో క్రియాటిన్‌ యూరియాల పరిమాణాలూ పెరుగుతుంటాయి. ఇటువంటి రోగులకు డయాలసిస్‌ చేస్తే కొంతకాలం బతికించుకోవచ్చు. కిడ్నీ మార్పిడితో చాలావరకూ దీనినుంచి బయటపడే అవకాశం ఉంది.

వ్యాధి నిర్ధారణ

కిడ్నీ వ్యాధులకు గురైనవారిలో సగం మందిలో ముందుగా ఎలాంటి లక్షణాలూ బయటపడవు. కిడ్నీ పనితీరు తగ్గేవరకూ వ్యాధులు బయటపడకపోవచ్చు. అందువలన ప్రాథమిక దశలోనే కిడ్నీ జబ్బులు రక్తం, మూత్రం స్కానింగ్‌పరీక్షలతో నిర్ధారించుకోవచ్చు. రక్తంలోని క్రియాటినిన్‌, యూరియాల పరిమాణాలను పరీక్షిస్తే కిడ్నీ పనితీరు, సామర్థ్యం స్పష్టమవుతుంది. కిడ్నీ పనిచేసే శక్తి శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా ఉంటుంది. అందుచేత ఏదైనా వ్యాధివల్ల కిడ్నీకి కొంచెం నష్టం కలిగినా, రక్తపరీక్షలో ఏవిధమైన తేడాలూ కనపడవు. అయితే వ్యాధితో వల్ల రెండు కిడ్నీలు 10 శాతం కంటే ఎక్కువగా పాడైతే, అప్పుడు రక్తంలోని క్రియాటినిన్‌, యూరియాల పరిమాణం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ముక్క పరీక్ష (బయాప్సీ) అవసరమవుతుంది.

వ్యాధిగ్రస్తులు తినకూడనవి

కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారు కొన్ని ఆహార పదార్థాల నుంచి దూరంగా ఉండాలి. కొన్నింటిని విస్మరిస్తే మూత్రపిండాలు బాగా పనిచేయడానికి సహాయపడుతుంది.

* ఉప్పు: సముద్ర ఉప్పు, సుగంధ ఉప్పు, అల్లం ఉప్పు, ఉల్లిపాయ ఉప్పు

* చికెన్: చికెన్ నగ్గెట్స్, హామ్, సాసేజ్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలు

* తయారుగా ఉన్న సూప్‌లు మరియు నిల్వచేసిన ఆహారాలు. వీటిలో సోడియం అధికంగా ఉంటుంది. ఆవాలు, సోయా సాస్ వంటివి.

*శుద్ధిచేసిన నూనెలు: సోయాబీన్, పొద్దుతిరుగుడు

* బీర్ మరియు సోడా వంటి వాటిని దూరపెట్టాలి.

* భాస్వరం అధికంగా ఉండే ఆహారాలు: ఎండిన కాయలు, బ్రోకలీ, పుట్టగొడుగులు మరియు చిక్కుళ్లు, మీరు తప్పక తినవలసి వస్తే రోజుకు ఒక కప్పు వడ్డించాలి.

*అధిక పొటాషియం కలిగిన అవోకాడో, అరటి మరియు నారింజ

ఏం తినాలి

పండ్లు మరియు కూరగాయలు కాకుండా, మరికొన్ని ఆహారాలను కూడా కిడ్నీ వ్యాధి ఉన్నవారు ఎంచుకోవచ్చు. ఇవి ప్రధానంగా తృణధాన్యాలు, గుడ్లు, కాయలు, చిక్కుళ్ళు, అవిసె గింజలు, డార్క్ చాక్లెట్, నువ్వుల నూనె. కొత్తిమీర, అమరాంత్, అల్లం, దాల్చినచెక్క, తాజా మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు మంచివి. నీరు మరియు మరికొన్ని పానీయాలతో మూత్రపిండాలను తేమగా ఉంచడం చాలా అవసరం. హెర్బల్ టీ మరియు నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను తీసుకోవాలి.

మార్పిడియే శాశ్వత పరిష్కారం

మూత్రపిండాల సమస్యల నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని అందించాలంటే కిడ్నీ మార్పిడి తప్పనిసరి. దీంతో రోగి సామాన్య వ్యక్తుల మాదిరిగా జీవనం గడపవచ్చు. డయాలసిస్‌నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాదాపుగా సాధారణ ఆరోగ్యవంతుల్లా ఆహారాన్ని తీసుకోవచ్చు. మొదటి సంవత్సరం తర్వాత మందులకు అయ్యే ఖర్చు డయాలసిస్‌తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎప్పటిలాగే రోగి తన ఉద్యోగం, ఇతర పనులు చేసుకోవచ్చు. కిడ్నీ మార్పిడికి సంబంధిత రోగికి తగిన అర్హత ఉన్నదీ, లేనిదీ మూత్రపిండ వైద్యనిపుణులు (నెఫ్రాలజిస్ట్‌) నిర్ణయిస్తారు. అన్నీ సరిపోతే కిడ్నీ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్‌) ఉత్తమమైన మార్గం.