మెదక్ పట్టణంలోని అజంపురా కాలనీని ఆరెంజ్ జోన్ గా…
సారథి న్యూస్, మెదక్: కరోనా నివారణకు ప్రజలంతా సహకరించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని అజంపురా కాలనీని ఆరెంజ్ జోన్ గా ప్రకటించడంతో ఎమ్మెల్యే సోమవారం ఆ ప్రాంతంలో పర్యటించారు. అజంపురాలో నలుగురికి కరోనా పాజిటివ్ రాగా ట్రీట్ మెంట్ అనంతరం వారిలో ముగ్గురికి నెగెటివ్ రాగా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా ఈ ప్రాంతాన్ని ఆరెంజ్ జోన్ గా ప్రకటించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకునేందుకు తాను వచ్చినట్లు చెప్పారు. ప్రజల అవసరాలను తీర్చేందుకు పోలీస్ , మున్సిపాలిటీ అధికారులు ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకుని పరిష్కరించినట్లు తెలిపారు. ప్రజలు ఇదేవిధంగా క్రమశిక్షణతో ఉండాలని కోరారు. వారం రోజుల్లో ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్ కు రానున్నారని పేర్కొన్నారు. కరోనా నిర్మూలనకు లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమని అందువల్ల ముఖ్యమంత్రి కెసిఆర్ మే 7వతేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మెదక్ జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, మెదక్ తహసీల్దార్ రవికుమార్ , డీఎస్పీ కృష్ణమూర్తి, టౌన్ సీఐ వెంకట్, పోలీస్ సిబ్బంది, ఆర్ఐ చరణ్ సింగ్ , వార్డ్ కౌన్సిలర్ మేడి కళ్యాణి మధుసూదన్ రావు, కౌన్సిలర్ జయరాజ్, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ మాయ మల్లేశం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్ ఉన్నారు.