Breaking News

కరోనా.. ఇదేం లెక్క?

కరోనా.. ఇదేం లెక్క?

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా లెక్క తప్పుతోంది. జిల్లా వైద్యశాఖ అధికారులు ఇస్తున్న లెక్కలు, రాష్ట్రస్థాయిలో విడుదల అవుతున్న హెల్త్‌ బులెటిన్‌లో ఇస్తున్న లెక్కలకు మధ్య భారీగా తేడాలు ఉంటున్నాయి. దీంతో కరోనా కేసులు, మృతులపై తెలంగాణవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో ఎక్కడెక్కడ ఎంతమందికి సోకిందన్న పూర్తి వివరాలతో పాటు రోజువారీ లెక్కను జిల్లా వైద్యశాఖాధికారులు తమ బులెటిన్‌లో విడుదల చేస్తున్నారు. కానీ, ఆ లెక్కలేవీ రాష్ట్రస్థాయి బులెటిన్‌లో కనిపించడం లేదు.

బుధవారం రంగారెడ్డి జిల్లాలో ఏడుగురు, మేడ్చల్‌ జిల్లాలో ఒకరు కరోనాతో మరణించారని ఆయా జిల్లాల డీఎంహెచ్‌వోలు తమ బులెటిన్‌లో వెల్లడించారు. అయితే, రాష్ట్రస్థాయి బులెటిన్‌లో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఏడుగురే మరణించారని చెప్పారు. అలాగే గురువారం రంగారెడ్డి జిల్లాలో 44 కేసులు నమోదైనట్టు జిల్లా అధికారుల బులెటిన్‌లో పొందుపరిస్తే రాష్ట్రస్థాయి బులెటిన్‌లో మాత్రం 48 కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. గురువారం మేడ్చల్‌ జిల్లాలో జిల్లా అధికారుల లెక్కలో 86 కేసులు నమోదైనట్టు చూపితే రాష్ట్రస్థాయి బులెటిన్‌లో మాత్రం 54 కేసులే నమోదైనట్టు చూపారు.

ప్రతిరోజూ ఇలాగే లెక్కల్లో తేడాలు వస్తూనే ఉన్నాయి. ఈ తేడా ఈ రెండు జిల్లాల్లోనే కాదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వస్తున్నాయి. ఈ లెక్కల్లో ఎందుకు తేడా వస్తుందో అధికారులెవరూ చెప్పడం లేదు. ఇదే విషయాన్ని డీఎంహెచ్‌ల దృష్టికి తీసుకెళ్తే.. తాము అన్నిరకాలుగా విచారించిన తర్వాతే కచ్చితమైన రిపోర్టు ఇస్తున్నామని, రాష్ట్రస్థాయి లెక్కలతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. అధికారులు ప్రకటిస్తున్న లెక్కల్లోనే ఇన్ని తేడాలుంటే పరిస్థితి ఏమిటని తెలంగాణ వాసులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ లెక్కలను చూస్తుంటే ప్రభుత్వం చెబుతున్నవి వాస్తవేలేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా కచ్చితమైన వివరాలను అధికారులు, ప్రభుత్వం వెల్లడించాలని కోరుతున్నారు.