కరోనా మహమ్మారి సినీనటులను, రాజకీయనాయకులను సైతం వదలడం లేదు. తాజాగా
హాలీవుడ్ నటుడు నిక్ కార్డెరో (41) కరోనాతో మృతి చెందారు. కెనడా దేశానికి చెందిన నిక్ న్యూయార్క్‌లోని బ్రాడ్‌వే సంస్థలో రంగస్థల నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ‘రాక్ ఆఫ్ ఏజెస్’, ‘బుల్లెట్ ఓవర్ బ్రాడ్‌వే’, ‘వెయిట్రస్’ తదితర నాటకాల్లో మంచి పాత్రలు చేశారు. ‘ఏ స్టాండప్ గై’, ‘గోయింగ్ ఇన్ స్టయిల్’, ‘ఇన్‌సైడ్ గేమ్’, ‘మాబ్‌టౌన్’ తదితర చిత్రాల్లో నటించారు. 2005 నుంచి 2020 వరకూ టీవీ, థియేటర్, సినిమాలలో ఎన్నోరకాల పాత్రలతో మెప్పించారు. బుల్లితెర కోసం చేసినవాటిలో ‘బ్లూబ్లడ్స్’లో కనబర్చిన నటనకు నిక్ మంచి మార్కులు తెచ్చుకున్నారు. నిక్ మరణించినట్టు ఆయన సతీమణి అమందా క్లూట్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు.