– ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి నివాళి
సారథి న్యూస్, అనంతపురం: ఫిలిప్సైన్స్ లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి రేవంత్ కుమార్(22) మృతదేహాన్ని శుక్రవారం స్వస్థలానికి తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. కదిరి, అనంతపురం పట్టణాలకు చెందిన రేవంత్‌కుమార్(22), వంశీ(19) ఫిలిప్సైన్స్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నారు.
ఏప్రిల్ 6న అక్కడ జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందారు. కరోనా విజృంభిస్తుండడంతో అంతర్జాతీయ విమాన రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో వారి మృతదేహాలను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు వీలుకాలేదు. ఈ విషయాన్ని కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డితో పాటు అనంతపురం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం కేంద్ర విమానయాన శాఖ మంత్రికి లేఖ రాశారు.
ఆ విద్యార్థుల మృతదేహాలను ఏపీకి తీసుకొచ్చేందుకు అయ్యే ఖర్చులు మొత్తం రూ. 68 లక్షలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పడంతో ఎట్టకేలకు మృతదేహాలను స్వస్థలాలకు తీసుకొచ్చారు. బాధిత కుటుంబసభ్యులు సీఎం జగన్, స్థానిక ఎమ్మెల్యేలు డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి, ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.