Breaking News

కట్టుదిట్టంగా లాక్ డౌన్

కట్టుదిట్టంగా లాక్ డౌన్

సారథి న్యూస్, మెదక్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ప్రక్రియను పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలకు సూచించారు. లాక్ డౌన్ అమలు, తీసుకుంటున్న చర్యలపై శనివారం ఆయన దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల చీఫ్ సెక్రటరీ లు, జిల్లాల కలెక్టర్ లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నిత్యావసర సరుకుల కొరత, సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కేసులు నమోదు కావడం లేదని, కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించాలని, భవిష్యత్ లో ఆహార కొరత రాకుండా వ్యవసాయ ఆధారిత పనులకు ఆటంకం కలిగించొద్దని కోరారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను హాట్ స్పాట్ గా గుర్తించామని, ఆ ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ మినహాయించి ఎలాంటి సడలింపులు ఉండదని ఆయన స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్లకు వివరించారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజారవాణా, రవాణా సౌకర్యాలు రద్దు చేస్తున్నామని, విద్యాసంస్థలు, శిక్షణ కేంద్రాలు షాపింగ్ మాల్స్, మూసి ఉంటాయని, మత ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, విత్తనాల, ఎరువుల తయారీ, వ్యవసాయాధారిత రంగాలకు వ్యవసాయ పరికరాలు విడిభాగాల దుకాణాలు, వ్యవసాయ యంత్రాల రవాణాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

సామాజిక దూరం పాటించండి

గ్రామాల్లో ఉపాధి హామీ పనులు రోడ్డు, సాగునీటి, పారిశ్రామిక ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టే సమయంలో ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరిస్తూ పనిలో పాల్గొనాలని స్పష్టంచేశారు. వలస కూలీల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని, కనీస వసతులు కల్పించాలని సూచించారు. కరోనా పాజిటివ్ కేసుల నమోదు పరిశీలించి లాక్ డౌన్ లో సడలింపులపై తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపారు. హాట్ స్పాట్ ప్రాంతాలను రాష్ట్ర, జిల్లా యంత్రాంగాలు ప్రకటించాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, పనిప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసిందని, ప్రదేశాల్లో ఉమ్మితే భారిగా జరిమానా విధించాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటీహెచ్ కేబుల్ సర్వీసులు యధావిధిగా నడుస్తాయని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి, ఏఎస్పీ నాగరాజు పాల్గొన్నారు.