Breaking News

ఓపెన్ యూనివర్సిటీ సెంటర్​ను కొనసాగించండి

ఓపెన్ యూనివర్సిటీ సెంటర్​ను కొనసాగించండి

సారథి న్యూస్, హుస్నాబాద్: డాక్టర్ బీఆర్​ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష కేంద్రాన్ని హుస్నాబాద్ డివిజన్ కేంద్రంలోనే కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జెరిపోతుల జనార్ధన్ డిమాండ్​ చేశారు. హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజితకు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. 15ఏళ్లుగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ హుస్నాబాద్ లో ఉండడం ద్వారా ఏటా 1500 నుంచి 2000 మంది విద్యకు దూరమైన యువతీ యువకులకు ఉన్నత విద్యనభ్యసించే అవకాశం కలిగిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కొనసాగుతున్న దూరవిద్య సెంటర్ ను కాలేజీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం కారణంగా సిద్దిపేట జిల్లా కేంద్రానికి తరలివెళ్లిందని ఆరోపించారు. డివిజన్ కేంద్రానికి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు స్టడీ సెంటర్లను తీసుకురావాల్సిన ప్రజా ప్రతినిధులు ఈ ప్రాంతంలో ఉన్న సెంటర్లు వేరే ప్రాంతాలకు తరలివెళ్తుంటే వారు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్ష కేంద్రాన్ని తిరిగి హుస్నాబాద్ కు తీసుకురావాలని లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండలాధ్యక్షుడు సేవాలాల్, పవన్, అరుణ్, శ్రీను, మంజుల, మమత, రజిత, సునీత పాల్గొన్నారు.