సిడ్నీ: టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే కచ్చితంగా ఐపీఎల్లో ఆడతానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. తమ ప్రభుత్వం అనుమతిస్తే.. భారత్‌కు ప్రయాణించేందుకు సిద్ధమేనన్నాడు. ఈ సీజన్లో స్మిత్ రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉంది. ‘ఏ క్రికెటరైనా దేశం తరఫున ప్రపంచకప్ ఆడడం గొప్ప విషయం. ఎందుకంటే పరిమిత ఓవర్లలో క్రికెట్లో ఇదే అతిపెద్ద ఈవెంట్. అందుకే ప్రతిఒక్కరూ ఆ టోర్నీలో ఆడాలని కోరుకుంటారు. ఇందుకు నేను కూడా అతీతం కాదు. ఒకవేళ ఏదైనా కారణాలతో టీ20 ప్రపంచకప్ వాయిదాపడితే ఐపీఎల్లోఆడతా.
దేశవాళీ టోర్నీల్లో ఇది అతిపెద్ద లీగ్. ఇప్పుడైతే ఇది మన చేతుల్లో లేదు. నిపుణులు, నిర్వాహకులు ఏం తెలుస్తారో చూడాలి. అప్పటివరకు వేచిచూడాల్సిందే’ అని స్మిత్ పేర్కొన్నాడు. దాదాపు రెండున్నర నెలల తర్వాత స్మిత్, వార్నర్.. న్యూసౌత్ వేల్స్ జట్టుతో కలిసి ఔట్ డోర్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఐసీసీకి లేఖ రాసిన విషయం తనకు తెలియదన్నాడు. బంతి రంగును మెరుగుపర్చేందుకు ఉమ్మి స్థానంలో మరో దానిని వెతకడం కష్టమని స్మిత్ అభిప్రాయపడ్డాడు.