Breaking News

ఎంత మందికైనా వైద్యం

ఎంతమందికైనా వైద్యం

  • కరోనాకు ప్రభుత్వాసుపత్రుల్లో మంచి ట్రీట్​మెంట్​
  • ప్రైవేట్​ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు
  • చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవద్దు
  • కరోనా కోసమే రాష్ట్రవ్యాప్తంగా 10వేల బెడ్లు
  • పీహెచ్​సీల్లో ఖాళీగా ఉన్న 200 డాక్టర్​ పోస్టుల భర్తీ
  • ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనాకు ప్రజలు భయాందోళనకు గురికావదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండొద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. కరోనా వైరస్ సోకినవారు అధిక వ్యయం చేస్తూ ప్రైవేట్​ ఆస్పత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని, ఎంత మందికైనా వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రులు, డాక్టర్లు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎంతో గొప్ప సేవలందిస్తున్న డాక్టర్లు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ ప్రజలకు పలు సూచనలు చేశారు. వైద్యారోగ్యశాఖకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ సగటుతో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మరణాల రేటు తక్కువగా ఉందన్నారు. గురువారం నాటికి చికిత్స పొందుతున్న వారు 3,692 మంది ఉన్నారని వివరించారు. దేశంలో అన్ లాక్ ప్రక్రియ నడుస్తోందని, ప్రజలు పనుల కోసం బయటకు వస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలు కూడా నడపాలని నిర్ణయించిందని, కరోనాతో సహజీవనం చేయక తప్పనిస్థితి వచ్చిందన్నారు.


చిల్లరమాటలు పట్టించుకోవద్దు
కరోనా విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మరీ అంత భయంకరమైన పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్ లోని గాంధీ, టిమ్స్ ఆస్పత్రుల్లోనే దాదాపు 3వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన ఐదువేల బెడ్లను సిద్ధం చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించామన్నారు. 1500 వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని, లక్షల సంఖ్యలో పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్కులు ఉన్నాయని సీఎం కేసీఆర్​ వివరించారు. మందులు, ఇతర పరికరాలకు కొరత లేదన్నారు. అవగాహన లేకుండా ఎవరో చేసే చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్​ అన్నారు.


వైద్యశాఖకు రూ.100 కోట్లు
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో అత్యవసర పనులు నిర్వహించుకోవడానికి వీలుగా జనరల్ బడ్జెట్ కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించామని సీఎం కేసీఆర్​ చెప్పారు. వైద్యకళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ స్కేలు అమలు చేయాలని నిర్ణయించామన్నారు. కొత్తగా నియమితులైన నర్సులకు కూడా పాత వారితో సమానంగా వేతనాలు చెల్లించాలని నిర్ణయించామన్నారు. ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు. అవుట్​ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వైద్యఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారిలో ఏ ఒక్కరినీ మినహాయించకుండా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అందించే పదిశాతం అదనపు వేతనం(కోవిడ్ ఇన్​సెంటివ్​) కొనసాగించాలని సీఎం ఆదేశించారు.


పీహెచ్​సీల్లో పోస్టుల భర్తీ
రాష్ట్రంలో పీజీ పూర్తిచేసిన 1200 మంది వైద్యులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్​ ఆదేశించారు. పీహెచ్​సీల్లో ఖాళీగా ఉన్న 200 డాక్టర్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. కరోనా రోగులకు అందించే మెడిసిన్​ కొరత రానీయొద్దని సూచించారు. ప్రైవేట్​ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ముర్తాజారిజ్వి, ఆరోగ్యశాఖ వివిధ విభాగాధిపతులు కరుణాకర్ రెడ్డి, రమేశ్ రెడ్డి, శ్రీనివాస్, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డి, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.